చిన్న కోడెల పెద్ద రచ్చకే తెరలేపుతున్నారు… ఇదిగో ప్రూఫ్!

ప్రస్తుతం ఏపీ టీడీపీలో సత్తెనపల్లి రచ్చ పీక్స్ కి చేరింది. ఇంతకాలం ఈ నియోజకవర్గానికి అభ్యర్థిని నియమించకముందు వరకూ ఐకమత్యంగా ఉన్నట్లు. ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించిన టీడీపీ క్యాడర్ ఒక్కసారిగా వర్గాలుగా చీలిపోయారు. ఆఖరికి కమ్మ – కాపు అంశాలను కూడా తెరపైకి బహిరంగంగా తీసుకొస్తున్నారు. కోడెల కుటుంబానికి వెన్నుపోటు పొడిచారంటూ టీవీల్లో మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు ఈ నియోజకవర్గం బాబుకు కొత్త తిప్పలు తెచ్చేలా ఉంది!

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కీలకమైన సత్తెనపల్లి నియోజకవర్గానికి తాజాగా బీజేపీ నుంచి టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ ను ఇన్ ఛార్జ్ గా నియమిస్తూ బాబు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై దివంగత కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం ఎర్రజెండా ఎగరేశారు. పరోక్షంగా చంద్రబాబు వ్యవహారశైలిపై విమర్శలు గుప్పించారు. దీంతో… వ్యవహరం చినికి చినికి గాలివానగా మారింది.

తాజాగా సత్తెనపల్లి నియోజకవర్గంలో కోడెల ఫోటోలతో శివరాం ర్యాలీ నిర్వహించారు. ఎక్కడా టీడీపీ జెండాలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్న శివరాం… కోడెల శివప్రసాద్ కుటుంబానికి న్యాయం జరగాలని, ఆయన ఆశయాలకు న్యాయం జరగాలని నినాదాలు చేస్తూ ఆయన వర్గీయులతో భారీ ర్యాలీ చేపట్టారు. దీంతో ఈ విషయం ఇప్పుడు యావత్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. పైగా… తన తండ్రి మరణానంతరం చంద్రబాబు తమకిచ్చిన మాట నిలబెట్టుకోలేదని, తమ తల్లికి సైతం నాలుగేళ్లుగా ఐదు నిమిషాలు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని దుబ్బయట్టారు!

దీంతో… ఈ వ్యవహారం అంబటికి అదృష్టంగా మారడంతోపాటు.. ఇదేదో టీడీపీలో పెద్ద రచ్చకే దారితీసేలా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి! సత్తెనపల్లి నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణను ఇన్ ఛార్జ్ గా ప్రకటించే ముందు స్థానికంగా టికెట్ కోసం ఆశలు పెట్టుకుని, గత నాలుగు సంవత్సరాలుగా పార్టీని, కేడర్ నూ కాపాడుకుంటూ వస్తున్న నాయకుల మధ్య ఏకాభిప్రాయం సాధించలేకపోవడం అనేది పూర్తిగా చంద్రబాబు వైఫల్యమనే కామెంట్లు కూడా ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ల నుంచి వినిపిస్తుండటం కొసమెరుపు!