ఎన్నికల మేనిఫేస్టో విడుదల చేసిన కోదండరాం

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పార్టీ గుర్తు ప్రకటించాడరు. పార్టీ గుర్తుతో పాటు ఎన్నికల మేనిఫేస్టోను ఆయన విడుదల చేశారు. పార్టీ గుర్తు “అగ్గిపెట్టె” అని ప్రజలంతా జనసమితికి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

పొత్తులు సీట్లపై ఇంకా స్పష్టత రాలేదని మంగళవారం వరకు వాటి పై ఒక క్లారిటి వస్తదన్నారు. దసరా వరకే తేలాల్సిన పొత్తులు ఇంకా తేలకపోవడం మంచి పరిణామం కాదన్నారు. ఆలస్యమయ్యే కొద్ది ప్రజాసంఘాలలో వ్యతిరేకత వస్తుందన్నారు. పొత్తులు, సీట్ల అంశానికి సంబంధించి సోమవారం సాయంత్రం మరోసారి కాంగ్రెస్ తో సమావేశమవుతామన్నారు. తమకు  గెలిచే సామర్ధ్యం ఉన్న అభ్యర్దులున్నారని, 10 స్థానాలు కావాలని ఖరాఖండిగా చెప్పామన్నారు.

టిజెఎస్ మేనిఫేస్టోను ఎలక్షన్ కమిషన్ కు పంపుతున్నామని, అప్రూవల్ తర్వాత మేనిఫేస్టోను విడుదల చేస్తామన్నారు. కూటమి ఏర్పాటు అందరికి అవసరమేనన్నారు. నిరంకుశ పాలనకు, ప్రజల ఆకాంక్షలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని కోదండరాం అన్నారు. నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలంటే మహాకూటమిలో అన్ని పార్టీలు సహకరించాలన్నారు.

సిపిఐ కూడా కూటమిలో కలిసి రావాలని తొందరపడి నిర్ణయం తీసుకోవద్దన్నారు. దీపావళి నాటికి కూటమిపై క్లారిటి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. ఉమ్మడి ఎజెండాతో ప్రజల్లో మార్పు తీసుకురావచ్చన్నారు.