‘ఆంధ్రావాలా’ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ గుర్తుందా.? తెలుగు సినీ చరిత్రలో అదో స్పెషల్ ఈవెంట్‌గా చెబుతుంటారు. దాదాపు పది లక్షల మంది జనాన్ని పోగేశారు.. అలాగని ప్రచారం చేశారు. మరీ, పది లక్షలని అనడం సబబు కాదుగానీ, రికార్డు స్థాయిలోనే జనం పోగయ్యారు.
ప్రత్యేక రైళ్ళు ఏర్పాటు చేసి.. వందలాది, వేలాది బస్సుల్ని, ఇతర వాహనాల్ని ఏర్పాటు చేసి జనాన్ని తరలించారు. ఇందు కోసం బోల్డంత ఖర్చయ్యింది కూడా.
స్వర్గీయ ఎన్టీయార్ సొంతూరు నిమ్మకూరులో స్వర్గీయ ఎన్టీయార్ అలాగే ఆయన సతీమణి బసవతారకం విగ్రహాల్ని ఆవిష్కరించారు, ‘ఆంధ్రావాలా’ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ వ్యవహారాల్లో బాగంగా.
ఈ మొత్తం తతంగానికి దాదాపు కోటి రూపాయలు ఖర్చయ్యిందని, జూనియర్ ఎన్టీయార్‌కి అత్యంత సన్నిహితుడైన వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘జనాన్ని తెప్పించాం..’ అని పదే పదే కొడాలి నాని చెప్పడం గమనార్హం. కొడాలి నానికి 20 లక్షల వరకూ ఖర్చయ్యిందట. నలభై లక్షలు జూనియర్ ఎన్టీయార్ పెట్టుకున్నాడట. మరో, నలభై లక్షల సంగతో మరి.?
స్వర్గీయ ఎన్టీయార్ మీద అభిమానమా.? జూనియర్ ఎన్టీయార్ కోసమా.? కొడాలి నాని ఇరవై లక్షలు ఎలాంటి రాజకీయ లాభం ఆశించకుండా అంత మొత్తం ఖర్చు చేశారని అనుకోలేం. జూనియర్ ఎన్టీయార్ కూడా పెద్ద ప్లాన్ వేసుకునే, అంతలా ఖర్చు చేసి వుండొచ్చు.
ఏం చేసినా, ‘ఆంధ్రావాలా’ సినిమా ఆడలేదు.. తెలుగుదేశం పార్టీలో కొడాలి నాని కొనసాగలేకపోయారు.. ఆ టీడీపీలో జూనియర్ ఎన్టీయార్‌కీ గౌరవం దక్కలేదు. ఇప్పుడేమో మొత్తంగా పరువు పోయింది..!