ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్, అనంతర పరిణామలే హాట్ టాపిక్స్. నిన్నమొన్నటివరకూ ఇవాళో రేపో చంద్రబాబు బయటకు వస్తారనే చర్చ టీడీపీలో నడిచేది కానీ… ఇటీవల ఆ టాపిక్ స్థానంలో ప్రత్యామ్నాయాలపై చర్చ జరుగుతుంది. బాబు లోపలే ఉంటే అనే ప్రశ్నకు… సమాధానాలు వెతికే పనిలో టీడీపీ శ్రేణులు ఉన్నట్లున్నాయి.
ఇందులో భాగంగా చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడంతో నంద్యాలలో అర్ధాంతరంగా ఆగిపోవాల్సివచ్చిన భవిష్యత్తుకు భరోసా యాత్రను.. నారా లోకేష్ కొనసాగించబోతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ అనంతరం చాలా మంది గుండె ఆగి చనిపోయారని చెబుతున్న వారి కుటుంబాలను పరామర్శించడానికి భువనేశ్వరి బయలుదేరుతున్నారు. దీనికి “న్యాయం గెలవాలి” అనే నామకరణం చేశారు.
వాస్తవానికి ఇది బాలయ్య చేయాలనుకున్న యాత్రం.. ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించిన యాత్ర. అయితే… నందమూరి వర్సెస్ నారా అనే సబ్జెక్ట్ లో వ్యూహాత్మకంగా బాలయ్యను తప్పించారనే చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తుంది. ఆ సంగతి అలా ఉంటే… భువనేశ్వరి చేపట్టిన న్యాయం గెలవాలి యాత్రపై వైసీపీ వెటకారం ఆడుతున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా.. తాముకూడా అదే కోరుకుంటున్నామని, నిజంగా పూర్తిస్థాయిలో నిజం నిజంగా గెలిస్తే భువనేశ్వరి, లోకేష్ లు కూడా లోపలకు వెళ్తారని మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు! ఇదే సమయంలో తాజాగా మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. ఇందులో భాగంగా… నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైలుకు వెళ్లాడని తెలిపారు.
ఇదే సమయంలో… నారా భువనేశ్వరి కూడా నిజం గెలవాలని అనుకుంటే చంద్రబాబు జీవితంలో ఎప్పటికీ బయటకు రాలేడని కొడాలి నాని తనదైన శైలిలో స్పందించారు. ఇక చంద్రబాబు కుటుంబమంతా అవినీతిలో కూరుకుపోయిందని చెప్పిన కొడాలి నాని… రాజకీయాల్లోకి రాకముందు చంద్రబాబు ఆస్తి కేవలం రెండు ఎకరాలు మాత్రమేనని, ఇప్పుడు ఆయన ఆస్తి రూ. 2000 కోట్లు దాటిపోయిందని.. ఇది ఎలా సాధ్యమైందని కొడాలి నాని ప్రశ్నించారు.
ఇదే సమయంలో… చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఆయన తరఫున వాదించేందుకు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న లాయర్లకు ఇప్పటివరకు రూ. 35 కోట్లు ఫీజులు కట్టారని, “నిజం గెలవాలి” యాత్ర నిర్వహణకు రూ. ఏడు కోట్లతో ప్రత్యేకంగా బస్సు రూపొందించారని.. కష్టపడి పొలం దున్నితే వచ్చిన డబ్బుతోనే ఈ యాత్ర చేపట్టారా..? అని కొడాలి నాని తనదైన శైలిలో సూటిగా ప్రశ్నించారు.
అనంతరం.. చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ “జన సున్నా” పార్టీ పెట్టారని కొడాలి నాని విమర్శించారు. గత ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ తెరవెనుక టీడీపీకి మద్దతుగా నిలిచారని, ఇప్పుడు ఆ ముసుగు తొలగించారని తెలిపారు. ఇక… చంద్రబాబు అరెస్టు తర్వాత లోకేష్ ఢిల్లీకి పారిపోయి మరోసారి పప్పు అని నిరూపించుకున్నాడని కొడాలి నాని విమర్శించారు.