ఎంట్రీతోనే ముఖ్యనేతకు ఎసరు పెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దుస్థితి ఏమిటో అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాటల్లో చెప్పాలంటే కాంగ్రెస్ మీద ఆంధ్రా ప్రజలు తమ మనసుల్లో ద్వేషాన్ని నింపుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ లో ఉండి పదవులు అనుభవించిన నేతలంతా…అప్పటి సమైక్య రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి సహా అందరూ తమ దారి తాము చూసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో తాను ఒక్కడే నిలబడి పార్టీ కోసం పని చేసింది రఘువీరారెడ్డి.

జగన్ కి వీర శ్రేయోభిలాషి అని అందరూ అంటున్నా ఆ పరిస్థితికి తానే అవకాశం కల్పించినా నాలుగేళ్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ జెండాను మోసిన ఓ ముగ్గురు నలుగురిలో రఘువీరారెడ్డి ఒకరు. అలాంటి నేత పదవికే ఇప్పుడు ఎసరు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రాకు బీజేపీ చేసిన మోసం… ప్రధాని మోడీ చేసిన ద్రోహం వెరసి కాంగ్రెస్ కొన్ని రోజులుగా రాష్ట్రంలో వాయిస్ పెంచింది. దేశవ్యాప్తంగా కూడా మోడీపై వ్యతిరేకత పెంపొందడంతో కాంగ్రెస్ పుంజుకుంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి కీలక తరుణంలో ఆంధ్రులకు చేసిన అన్యాయాన్ని తామే సరిదిద్దుతామంటూ కాంగ్రెస్ చెబుతున్న మాటల పట్ల జనం కూడా కొంత ఆకర్షితులు అవుతున్నారు.

దాన్ని గుర్తించిన కాంగ్రెస్ ఏపీలో మళ్ళీ బలపడాలని ప్రణాళికలు రచించి కీలక నేతలను ఇక్కడ మోహరించి ముందుకు పోతుంది. ఈ క్రమంలోనే పార్టీ విడిచి వెళ్లిపోయిన నేతలను తిరిగి వెనక్కి పిలవాలని రాహుల్ నిర్ణయించారు. ఆ మేరకు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఇటీవలే తిరిగి పార్టీలో చేర్చుకున్నారు. ఆయన రాక అనంతర పరిణామాలు ప్రస్తుత పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి సీట్ కిందకు నీళ్లు తెచ్చాయని తాజా సమాచారం. పార్టీలోకి తిరిగి వచ్చేటప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని షరతులు పెట్టారని అందులో ముఖ్యమైంది రఘువీరారెడ్డిని పిసిసి పదవి నుంచి తొలగించడమని విశ్వసనీయ వర్గాల సమాచారం.

వచ్చేది ఎన్నికల సంవత్సరం కాబట్టి బలమైన నేత పార్టీకి నేతృత్వం వహిస్తే బావుంటుందని ఎన్నికల్లో పార్టీ అవసరాలను చూడగలిగే వ్యక్తిని ఆ పదవిలో కూర్చోబెట్టాలని కిరణ్ సూచించారుట. ఆ క్రమంలోనే రఘువీరారెడ్డిని మార్చి ఆ పదవిలోకి కనుమూరి బాపిరాజును తీసుకొస్తే వచ్చే ఎన్నికల్లో బలమైన పోటీ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని అగ్రనాయకత్వానికి చెప్పారట. ఆయన వాదనను సానుకూలంగా విన్న కాంగ్రెస్ అధిష్టానం కూడా పునరాలోచనలో పడిందని సమాచారం. అయితే పార్టీ జెండా పట్టుకునేందుకు కూడా కార్యకర్త లేని దుస్థితిలో పార్టీని నిలబెట్టిన వ్యక్తిని హఠాత్తుగా, అది కూడా ఎన్నికల సమయంలో మార్చేస్తే ఎలాంటి ప్రభావం పడుతుందో అనే విషయం కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవరపరుస్తోంది. అందుకే రఘువీరారెడ్డిని మార్చాలని వున్నా వెంటనే ఆ పని చేయలేకపోతుందని టాక్. అయితే ఎన్నికల్లో గెలవడానికి జనం మనసులో స్థానం సంపాదించడంతో పాటు ఆర్ధికంగా కూడా బలంగా ఉండాలి. అప్పుడే కొద్దోగొప్పో ఎన్నికల్లో ప్రభావం చూపించగలరు. ఈ పాయింట్ దగ్గరే కాంగ్రెస్ పునరాలోచనలో పడిందని విశ్వసనీయ సమాచారం.