సినీ నటుడు, నిర్మాత నాగబాబుకి జనసేన పార్టీలో కీలక పదవి లభించింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన సోదరుడైనప్పుడు, జనసేన పార్టీలో నాగబాబుకి ఎంతటి కీలక పదవి అయినా తేలిగ్గానే లభిస్తుంది. అయితే, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు.!ఇదివరకు పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ పదవి నాగబాబుకి వుంది. దాంతో పోల్చితే, ఇప్పుడు దక్కిన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి అత్యంత కీలకమైనది.
అసలు, వున్నపళంగా ఈ పదవిని నాగబాబుకే కట్టబెట్టాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు నిర్ణయించుకున్నట్లు.? జనసేన పార్టీకి సంబంధించి ‘నెంబర్ టూ’ ఎవరంటే, నో డౌట్.. అది నాదెండ్ల మనోహర్ అనే చెప్పాలి. నాగబాబు కూడా పార్టీలో వున్నాగానీ, మొత్తం వ్యవహారాల్ని నాదెండ్ల మనోహర్ చూసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో బిజీగా వున్నప్పుడు, పార్టీని నడిపిస్తున్నది నాదెండ్ల మనోహర్.. అని నిస్సందేహంగా చెప్పొచ్చు.
పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాల్లోనూ నాదెండ్ల మనోహర్‌దే కీలక పాత్ర. అయితే, నాదెండ్ల వెన్నుపోటు పొడుస్తారనే ప్రచారం ఈ మధ్య గట్టిగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే, పార్టీ ప్రధాన కార్యదర్శి.. అనే కీలక పదవిని నాగబాబుకి పవన్ కళ్యాణ్ అప్పగించినట్లు తెలుస్తోంది.
ఎన్నికలు సమీపిస్తున్న దరిమిలా, పార్టీలో చేరికల దగ్గర్నుంచి, పార్టీ నాయకుల్లో ఎలాంటి గ్యాప్స్ లేకుండా చూసుకోవడం.. ఇలాంటి బాధ్యతలు నాగబాబు అయితే బాగా చూసుకుంటారని పవన్ కళ్యాణ్ భావించి, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారట.