చంద్రబాబుకు కేశినేని షాక్

అవును పిలిచి పదవిని ఇస్తే వద్దంటూ చంద్రబాబునాయుడుకు  కేశినేని షాకిచ్చారు. లోక్ సభలో డిప్యుటి ఫ్లోర్ లీడర్, పార్టీ విప్ పదవులను నానికి కేటాయించారు చంద్రబాబు. అయితే విప్ లాంటి పెద్ద పదవికి తాను అర్హుడిని కానంటూ నాని చంద్రబాబుకు బదులిచ్చారు. డిప్యుటి ఫ్లోర్ లీడర్ మాత్రమే ఉంటానని చెప్పి విప్ పదవి తీసుకునేందుకు తిరస్కరించారు.

పిలిచి పదవిని కేటాయిస్తే నాని తిరస్కరించటం నిజంగా చంద్రబాబుకు షాక్ లాంటిదే. విప్ పదవిని తిరస్కరించటమంటే కేశినేనిలోని అసంతృప్తే కారణమని పార్టీ వర్గాలంటున్నాయి. నిజానికి టిడిపి తరపున గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని ముగ్గురూ రెండోసారి గెలిచిన వారే.

ఎంపిలు గెలిచిన విషయాన్ని పక్కనపెడితే వయస్సు రీత్యా కేశినేని బహుశా పెద్దయ్యుండొచ్చు. వయస్సు రీత్యా పెద్ద వాడినైన తనను కాదని మిగిలిన ఇద్దరికి తనకిచ్చిన పదవులకన్నా పెద్ద పదవులు ఇవ్వటంతో కేశినేనిలో అసంతృప్తి మొదలైందట.

పైగా కేశినేని టిడిపిని వదిలేసి బిజెపిలో చేరుతారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. బిజెపి నేతలతో ప్రత్యేకించి నితిన్ గడ్కరీ లాంటి సీనియర్లతో కేశినేని సన్నిహితంగా మెలుగుతుంటారు. మొన్న నాగ్ పూర్ లో గడ్కరీ గెలవగానే అక్కడికెళ్ళి నాని మరీ అభినందించి రావటం టిడిపి నేతలనే ఆశ్చర్యపరిచింది. సరే కారణాలేవైనా మొత్తానికి నానిలోని అసంతృప్తి బయటపడటం ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాల్సిందే.