షాకింగ్ న్యూస్… కాంగ్రెస్‌కు సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి రాజీనామా

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. రాజేంద్రనగర్ నుంచి అసెంబ్లీ సీటు ఆశిస్తున్న కార్తీక్ రెడ్డికి టికెట్ లేదనే సంకేతాలు అందడంతో ఆయన స్వతంత్ర అభ్యర్ధిగానే బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎటువంటి పిలుపు రాకపోవడంతో గురువారం మధ్యాహ్నం కార్యకర్తలతో సమావేశమయ్యి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

తన రాజీనామా లేఖను టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరియు ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీలకు పంపినట్టు తెలుస్తోంది. రాజీనామా పై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అసలైన కార్యకర్తలకు ఇవ్వకుండా గాంధీ భవన్ లో వ్యాపారం చేసే వారికి టికెట్ ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏ ఏ రేటుకు ఒక్కొ టికెట్ ఇస్తున్నారో చెప్పాల్సిన అవసరముందన్నారు.

కార్తిక్ రెడ్డి నిర్ణయంతో కాంగ్రెస్ లో కలవరం మొదలైంది. కార్తీక్ రెడ్డి తల్లి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నుంచి పోటి చేస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇవ్వలేమన్న ఉద్దేశ్యంతో కార్తీక్ రెడ్డికి టికెట్ నిరాకరించారు. ఏ ఒక్కరికి ఇచ్చిన ఇతర నేతల నుంచి ఒత్తిళ్లు వస్తాయనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించలేదని తెలుస్తోంది. రాజీనామాను ఆమోదిస్తారా లేక పార్టీ తరపున రాజేంద్రనగర్ నుంచి టికెట్ కేటాయిస్తారా అనే విషయాన్ని ఉత్తమ్ చెప్పాలని కార్తీక్ రెడ్డి డిమాండ్ చేశారు.