చంద్రబాబునాయుడు దగ్గర కరణం బలరామ్ మాట చెల్లుబాటవుతుందా అన్న సందేహాలు జిల్లాలో బాగా చక్కర్లు కొడుతున్నాయ్. లేకపోతే కరణంతో కొత్త తలనొప్పులు మొదలవుతాయా అన్న విషయంపైన కూడా పార్టీలో చర్చ మొదలైంది. తాజా రాజకీయ పరిణామాల్లో కరణం చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో కర్చీఫ్ వేశారు. చాలా కాలంగా కరణం ఏమి చెప్పినా చంద్రబాబు దగ్గర చెల్లుబాటు కావటం లేదు. సొంత నియోజకవర్గం అద్దంకిలోనే కరణం మాట ఎవరూ వినటం లేదు. మొత్తం ప్రయారిటీ అంతా ఫిరాయింపు ఎంఎల్ఏ గొట్టిపాటి రవికుమార్ దే కావటంతో పార్టీ నేతలు, ఉన్నతాధికారులు కూడా గొట్టిపాటి మాటకే విలువిస్తున్నారు. దాంతో కరణం పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా జరిగారు.
జిల్లాలోనే సీనియర్ నేత అయిన కరణంకు నిజంగా పార్టీలో పరిస్ధితులకు ఎదురీదుతున్నారు. సీనియర్ నేతల్లో చాలామంది కరణంతో పెద్దగా మాట్లాడటం లేదు. దాంతో జిల్లాలోని అధికారులు కూడా ప్రాధాన్యత ఇవ్వటం లేదు. కరణం పార్టీలో ఇమడలేని పరిస్ధితుల్లోనే నెట్టుకొస్తున్నారు. దాంతో ఏదో ఓ రోజు కరణం టిడిపి నుండి బయటకు వెళ్ళిపోవటం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపధ్యంలోనే చీరాల ఎంఎల్ఏ ఆమంచి కృష్ణమోహన్ టిడిపికి రాజీనామా చేశారు. దాన్ని కరణం అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
గొట్టిపాటి ఉన్నంత వరకూ తనకు అద్దంకిలో చంద్రబాబు టికెట్ ఇవ్వరని కరణంకు అర్ధమైపోయింది. ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో అర్ధంకాని పరిస్ధితుల్లో కరణం అవస్తలు పడుతున్నారు. ఇటువంటి పరిస్ధితుల్లోనే ఆమంచి పార్టీని వీడటంతో చీరల నియోజకవర్గంపై కరణం కన్నేశారు. అందుకే చంద్రబాబు టికెటిస్తే చీరాలలో పోటీ చేయటానికి తాను రెడీ అంటూ ముందుగా ఓ ప్రకటన పడేశారు. చంద్రబాబు టికెట్ ఇస్తారా ఇవ్వరా అన్నది వేరే విషయం. అద్దంకిలో టికెట్ సాధ్యం కానపుడు చీరాలలో అయినా టికెట్ ఇవ్వకపోతారా అన్నది కరణం ఆశగా కనిపిస్తోంది. మరి కరణం ఆశను చంద్రబాబు ఎంత వరకూ నెరవేరుస్తారో చూడాల్సిందే.