ఎంత బలమున్న నాయకుడికైనా, ఎంతటి మెజారిటీ ఉన్న పార్టీకైనా వలస నేతలతో తిప్పలు తప్పవు. అందుకే జగన్ సీఎం అయ్యాక వలసల్ని ప్రోత్సహించలేదు. కానీ ఒత్తిడి మరీ ఎక్కువ కావడంతో కొందరికి మాత్రం అవకాశం ఇచ్చారు. అది కూడ అనధికారికంగానే. వాళ్ళు పేరుకు టీడీపీ ఎమ్మెల్యేలే అయినా వైసీపీ ఆధ్వర్యంలో నడుస్తారు. అయితే పార్టీలో చేర్చుకునే విధానంలో మార్పు తీసుకురాగలిగిన జగన్ చేరిక అనంతరణం పరిణామాలను మాత్రం మార్చలేకపోతున్నారు. అందుకు నిదర్శనమే చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వ్యవహారం.
టీడీపీ నుండి వైసీపీలోకి అనధికారికంగా వచ్చేశారు ఈయన. అయితే ఆయన కుమారుడు మాత్రం అధికారికంగా వైసీపీలోనే ఉన్నారు. అలా తండ్రీకొడుకులు చీరాల వైసీపీలో హవా నడిపిస్తున్నారు. ఇది వైసీపీ నేత ఆమంచికి అస్సలు నచ్చట్లేదు. దీంతో అక్కడ పెద్ద రగడ జరుగుతోంది. చీరాలలో పెట్టిన ఈ చిచ్చు చాలదన్నట్టు అద్దంకిలో కూడ కరణం బలరాం ఎఫెక్ట్ కనబడుతోంది. వచ్చే ఎన్నికల్లో అద్దంకి టికెట్ తన కుమారుడికి ఇప్పించుకోవాలనేది కరణం ఆశయం, అందుకే అక్కడ కూడ హడావుడి చేస్తున్నారు. ఇందులో భాగంగా పుట్టినరోజు సంధర్బంగా బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్ ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు అద్దంకిలో.
అలాగే పదవిలోకి వచ్చి ఏడాది గాచిన సందర్బంగా వైసీపీ అడ్డంకి ఇంఛార్జ్ కృష్ణ చైతన్య ఫ్లెక్సీలను పెట్టారు ఆయన అభిమానులు. దీంతో ఇరువురి నడుమ హీట్ నెలకొంది. మున్సిపల్ అధికారులేమో అనుమతులు లేవని కృష్ణ చైతన్య ఫ్లెక్సీలను తొలగించి, బలరాం ఫ్లెక్సీలను అలాగే వదిలేశారు. ఇది కరణం పనేనని కృష్ణ చైతన్య వర్గం ఆరోపిస్తోంది. టీడీపీ నుండి వచ్చి వైసీపీలో ఆయన పెత్తనం ఏమిటో అంటూ అటు చీరాల, ఇటు అద్దంకి వైసీపీ శ్రేణుల్లో నిరసన వ్యక్తమవుతోంది. దీన్ని టీడీపీ శ్రేణులు క్యాష్ చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాయి. రెండు చోట్లా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తూ వైసిపీ శ్రేణులు రెండుగా చీలిపోయే సందర్భం కోసం ఎదురుచూస్తున్నారు.