చంద్రబాబుకు కాపు నేతల షాక్

తెలుగుదేశంపార్టీలోని కాపు నేతలు చంద్రబాబునాయుడుకు పెద్ద షాకే ఇచ్చారు. బుధవారం చంద్రబాబు నిర్వహించిన పార్టీ నేతల సమావేశానికి పార్టీలోని కాపు నేతలెవరూ హాజరుకాలేదు.  కాపు నేతలైన బోండా ఉమామహేశ్వరరావు, పంచకర్ల రమేష్, బూరగడ్డ వేదవ్యాస్, జ్యోతుల నెహ్రూ  విజయవాడలోనే ఉన్నప్పటికీ చంద్రబాబు సమావేశానికి మాత్రం హాజరుకాలేదు. దాంతో పార్టీలో సంచలనంగా మారింది.

విషయం ఏమిటంటే చంద్రబాబు విదేశాల్లో ఉన్న సమయంలో కాకినాడలో కాపునేతలు రహస్య సమావేశం పెట్టుకున్నారు. సమావేశంలో పాల్గొన్న నేతల్లో అత్యధికులు మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వారే కావటం గమనార్హం. మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోయిన  తర్వాత పార్టీలో పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి.

ఈ నేపధ్యంలోనే నలుగురు రాజ్యసభ ఎంపిలు ఈమధ్యనే బిజెపిలోకి ఫిరాయించారు. అంతుకుముందే టిడిపిలోని కొందరు ఎంఎల్ఏలు, చాలామంది నేతలు టిడిపి నుండి బిజెపిలోకి ఫిరాయించబోతున్నట్లు విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే కాపు నేతలందరూ సమావేశం అవ్వటం పార్టీలో కలకలం రేగింది.

పార్టీలోని కీలక నేతలు సమావేశం అయిన విషయం బయటకు పొక్కగానే చంద్రబాబులో టెన్షన్ మొదలైంది. ఈ నేపధ్యంలోనే విదేశాల నుండి విజయవాడకు వచ్చిన చంద్రబాబు కాపు నేతల సమావేశం నిర్వహించారు. అయితే ఆ సమావేశానికి ఒక్క కాపు నేత కూడా హాజరుకాలేదు. దాంతో చంద్రబాబుకు పెద్ద షాకే తగిలింది. పార్టీలో ఎప్పుడేం జరుగుతోందో తెలీక అందరిలోను అయోమయం మొదలైంది.