మొన్న మహాసేన రాజేష్, నిన్న కన్నా లక్ష్మినారాయణ.. రేపు ఎవరో.! జనసైనికులు ‘ప్చ్.. ఏం చేస్తాం.?’ అంటూ నిట్టూరుస్తున్నారు. అధినేత పవన్ కళ్యాణ్, 2024 ఎన్నికలకు సంబంధించిన వ్యూహమేంటో చెప్పరాయె.! ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారో తెలియదాయె.! ఎవరికి ఎలివేషన్లు పార్టీ పరంగా ఇవ్వాలో తెలియక జనసైనికులు నానా తంటాలూ పడుతున్నారు. మొన్నటి వరకూ మహాసేన రాజేష్‌కి విపరీతమైన ఎలివేషన్లు ఇచ్చారు జనసైనికులు. చివరికి ఆయన టీడీపీలోకి దూకేశారు. కన్నా లక్ష్మినారాయణ విషయంలోనూ అదే జరిగింది. జనసేనలో చేరతానని సంకేతాలిచ్చిన కన్నా, టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు.
‘ఎవరిష్టం వాళ్ళది.. మనం ఎవర్నీ తిట్టొద్దు..’ అంటూ మహాసేన రాజేష్ వ్యవహారంలో జనసేన నేత నాగబాబు, జనసైనికులకు ట్వీటు రూపంలో క్లాస్ తీసుకున్నారు. కానీ, జనసైనికులు అసహనం వెల్లగక్కకుండా వుండలేకపోతున్నారు. ‘మీకేం.. మీరు బాగానే వుంటారు. గ్రౌండ్ లెవల్‌లో మేం మొహాలు చూపించలేకపోతున్నాం.. ఎవరికి జై కొట్టాలో తెలియడంలేదు..’ అంటూ జనసైనికులు, జనసేన మద్దతుదారులు వాపోతున్నారు. ‘వ్యూహాన్ని జనసేనానికి వదిలెయ్యండి..’ అని నాదెండ్ల మనోహర్, నాగబాబు లాంటోళ్ళు ఎంత చెప్పినా, జనసైనికుల బాధ మాత్రం వర్ణనాతీతం.
జనసేనలో చేరతానని ఏనాడూ కన్నా లక్ష్మినారాయణ చెప్పలేదు. కాకపోతే, పవన్ కళ్యాణ్‌కి అండగా నిలవాల్సిన అవసరం వుందని మాత్రం అన్నారు. ఇప్పుడు చంద్రబాబుకి అండగా వుండాల్సిన అవసరాన్ని కన్నా గుర్తించారంతే.! అది ఆయన రాజకీయ అవసరం.