చంద్రబాబులో నాన్చుడు ధోరణి పోవడం లేదు. ఎంత ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయితే మాత్రం ప్రయోజనం ఏముంది.. అక్కరకు రాని అనుభవం ఉండి ఏమి లాభం. ప్రస్తుతం ఈ కామెంట్లే చేస్తున్నారు టీడీపీలో కన్నా లక్ష్మీనారాయణ అభిమానులు. పార్టీలో చేరేవరకూ ఇంద్రుడూ చంద్రుడూ సీనియర్ లీడరూ అంటూ మాటలు చెప్పడం, ఒకసారి కండువా వేసుకున్నాక ఇక లైట్ తీసుకోవడం బాబుకు పరిపాటిగా మారిందని ఆరోపిస్తున్నారు. వారి ఆరోపణల చాటు ఆవేదనకు బలమైన కారణం ఉంది.
చంద్రబాబుపై కన్నా లక్ష్మీనారాయణ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే విషయంలో అంతులేని ఆలస్యాన్ని, అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారంటూ ఫైరవుతున్నారు. కారణం… సత్తెనపల్లి సీటు కన్ ఫర్మేషన్ విషయంలో బాబు చేస్తున్న ఆలస్యం. అవును… కావాలనే ఆలస్యం చేస్తున్నారో.. లేక, బాబు మనసులో మరో ఆలోచన ఏమైనా ఉందేమో తెలియదు కానీ… సత్తెనపల్లి అసెంబ్లీ టిక్కెట్టును కన్నాకు కన్ఫాం చేస్తూ బాబు నిర్ణయం ప్రకటించలేకపోతున్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుపున సత్తెనపల్లి సీటునుంచే పోటీ చేసే విధంగా బాబుదగ్గర మాట తీసుకున్న తర్వాతే కన్నా.. సైకిల్ ఎక్కారని అంటున్నారు ఆయన అభిమానులు. అలాంటప్పుడు ఇంకే ప్రోబ్లం అని ఎవరైనా అడిగితే… బాబుని నమ్మలేమని చెబుతుండటం గమనార్హం. ఈ విషయంలో బాబు నాన్చుడు ధోరణి చూస్తుంటే తమకు కొత్త అనుమానాలొస్తున్నాయని అంటున్నారంట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయాల్సిన నియోజకవర్గం ఏమిటన్న దానిపై క్లారిటీ ఎందుకు ఇవ్వడంలేదో అని వారు ప్రశ్నిస్తున్నారు.
గుంటూరులో ఏదో ఒక నియోజకవర్గాన్ని అప్పగిస్తారా? ముందుగా అనుకున్నట్లుగానే సత్తెనపల్లి సీటును ఆయనకు కేటాయిస్తారా? లేక, పక్కనే ఉన్న పెదకూరపాడును కన్ ఫాం చేస్తారా అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. క్యాలెండర్ లో డేట్లు మారుతున్నాయే తప్పించి.. చంద్రబాబు నిర్ణయం మాత్రం తేలట్లేదన్న విమర్శ వినిపిస్తోంది. పైగా ఈమధ్యనే ఉమ్మడి గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లిన సమయంలో… సీటును కన్ ఫాం చేస్తారని అంతా భావించారు. అయినా కూడా బాబు వారిని నిరాసపరిచారు.
దీంతో… ఆందోళన వ్యక్తం చేస్తున్న కన్నా అభిమానులు… చంద్రబాబు కావాలనే సత్తెనపల్లి విషయంలో విషయాన్ని నానుస్తున్నారని, ఆఖరికి కన్నాకు ఊహించని విధంగా ఏదో ఒక సీటు ఇచ్చి బలిపశువుని చేసినా చేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారంట. మరి ఈ విషయంలో చంద్రబాబు ఎందుకు ఆలస్యం చేస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే!