విచిత్రంగా ఉంది అడ్వకేట్ జనరల్ వాదన. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు అవినీతిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హై కోర్టులో పిటీషన్ వేశారు. విశాఖపట్నంలో ప్రభుత్వం వివిధ కంపెనీలకు కేటాయించిన భూములపై కేసు వేశారు. భూములను, ప్రోత్సాహకాలను తనకు కావాల్సిన వారికే చంద్రబాబు ఇచ్చుకుంటున్నాడంటూ కొన్ని ఉదాహరణలను కూడా కన్నా తరపు లాయర్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు.
కంపెనీలు పెడతామని చెబుతున్న పెట్టుబడులకన్నా ప్రభుత్వం ఇచ్చిన భూములు, ప్రోత్సాహకాల విలువే చాలా ఎక్కువంటూ అమరావతిలో హెచ్సీఎల్ కు కేటాయించిన భూముల గురించి చెప్పారు. అలాగే విశాఖపట్నం, మధురవాడలో ఈ సెంట్రిక్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్, విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు భూ కేటాయింపులను కూడా కన్నా తరపు లాయర్ ప్రస్తావించారు.
అయితే, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తు, రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ముఖ్యమంత్రి ఒక్కడినే వ్యక్తిగతంగా బాధ్యుడిని చేయటం తగదన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రిని బాధ్యుడిని చేయటమా కాదా అన్నది కాదు ప్రశ్న. భూ కేటాయింపుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయా లేదా అన్నదే సమస్య. భూ కేటాయింపుల్లో అవినీతి జరిగిందని, అక్రమాలు జరిగిందని కన్నా తరపు లాయర్ వాదిస్తుంటే ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా బాధ్యుడిని చేయటం తప్పంటూ అడ్వకేట్ జనరల్ వాదించటంలో అర్ధమేంటి ?
దమ్మాలపాటి వాదన చూస్తుంటే భూ కేటాయింపుల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని అంగీకరిస్తున్నట్లే ఉంది. నిజానికి క్యాబినెట్ అంటే ఒకపుడు ఎలా ఉండేదో కానీ ఇఫుడు మాత్రం ఉత్సవ విగ్రహం లాగ తయారైంది. ముఖ్యమంత్రి ఏదనుకుంటే దానికి తలూపటమే తప్ప మంచి చెడుపై చర్చించే విచక్షణే కోల్పాయారు మంత్రులు. సిఎం తీసుకుంటున్న నిర్ణయం తప్పని తెలిసినా ఒక్క మంత్రి కూడా నోరిప్పటం లేదు. మంత్రి పదవులనుండి పీకేస్తారేమోనన్న భయమే మంత్రుల నోళ్ళను కట్టేస్తోంది.
చంద్రబాబునాయుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్పాఆర్ అనే కాదు అందరూ సిఎంల వరసా ఇలాగే ఉంది. ఎవరైనా ఏ కారణంతో అయినా నోరిప్పినా మెజారిటీ నిర్ణయం అని సిఎంలు తాము అనుకున్నట్లుగా చేసుకుపోతున్నారు. ఇటువంటి సిఎంలు, మంత్రివర్గాలున్నంత వరకు ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయానికీ బాధ్యత పూర్తిగా ముఖ్యమంత్రిదే అవుతుంది. మంత్రివర్గ సమావేశానికి ముందు ఇచ్చే అజెండాను కూడా మంత్రులు విప్పి చూసేందుకు అవకాశం లేదు.
చాలామంది మంత్రులకు అసలు అజెండాలో ఏముందో కూడా తెలీదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే, అజెండాలో ఎక్కువగా భూ కేటాయింపులో, ప్రోత్సాహకాలకు సంబంధించిన అంశాలే ఉంటాయి. అవన్నీ సిఎం స్ధాయిలో నిర్ణయమైపోయుంటాయి. తర్వాతే అజెండా రూపంలో మంత్రివర్గం ముందుకొస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా బాధ్యుడిని చేయటం తగదని అడ్వకేట్ జనరల్ వాదించటంలో అర్ధమేలేదు.