ఏసు క్రీస్తు క్రిస్టియన్ కాదు: కేఏ పాల్ కొత్త వాదన.!

కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్ క్రైస్తవ మత ప్రబోధకుడిగా దాదాపు 200 దేశాల్లో ‘మత ప్రచారం’ చేపట్టిన విషయం విదితమే. తెలుగునాట ప్రజా శాంతి పేరుతో ఓ రాజకీయ పార్టీని స్థాపించి బోల్డంత కామెడీని కూడా పండిస్తుంటారు కేఏ పాల్.

‘నేను ప్రధాన మంత్రినవుతా.. పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రిని చేస్తా..’ అంటారాయన. కేసీయార్‌ని ఓడిస్తా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి డిపాజిట్లు రాకుండా చేస్తా.. ఇలాంటి డైలాగులు కూడా తరచూ ఆయన నోటివెంట వస్తుంటాయి. 2019 ఎన్నికల సమయంలో, తెలుగు రాష్ట్రాల్లో.. అందునా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేఏ పాల్ చేసిన రాజకీయ హంగామా అంతా ఇంతా కాదు.

మళ్ళీ ఇప్పుడాయన ఇంకోసారి తెలుగు రాష్ట్రాల్లో తనదైన రాజకీయాన్ని చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందనీ, తెలంగాణకు తాను ముఖ్యమంత్రినవుతాననీ, తాను అధికారంలోకి వస్తే, తెలుగు రాష్ట్రాల అప్పులు తీర్చేస్తాననీ కేఏ పాల్ చేస్తున్న కామెడీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఇలా వుంటే, తాజాగా కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. అదీ ఏసు క్రీస్తు మీద. ఏసు క్రీస్తు ఏ మతానికీ చెందినవాడు కాదట. ‘ఏసు క్రీస్తు క్రిస్టియన్ కాదు.. హిందువూ కాదు.. మహమ్మదీయుడు కూడా కాదు.. ఆయన దైవ కుమారుడు..’ అంటూ కేఏ పాల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

అంతేనా, తాను హిందువుగా జన్మించాననీ, హిందువుగానే మరణిస్తానని కేఏ పాల్ ప్రకటించడం గమనార్హం. హిందువుగా జన్మించి, హిందువుగా చనిపోవాలనుకుంటున్నప్పుడు.. మధ్యలో క్రైస్తవ మత ప్రచారం ఎందుకు చేసినట్లు.? కేఏ పాల్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. కానీ, ఆయన చెప్పడుగాక చెప్పడు.

ఏ ప్రశ్నకీ సమాధానం చెప్పడాయన, ఆయన చెప్పిందే వినాలి ఎవరైనా. మొత్తమ్మీద, కేఏ పాల్ చుట్టూ బోల్డంత కామెడీ వైఫైలా రన్ అవుతుంటుంది. మామూలుగా అయితే, ‘ఏసు క్రీస్తు క్రైస్తవుడు కాదు’ అని కేఏ పాల్ అన్నందుకు, ఆయన మీద క్రైస్తవ మత సంఘాలు బోల్డన్ని ఆందోళనలు చేయాలి. చేస్తాయా.? చేయగలవా.?