పవన్ కు “కేంద్ర మంత్రి పదవి” ఆఫర్!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కేంద్రమంత్రి పదవి ఆఫర్ వచ్చింది. కాకపోతే అది ప్రస్తుతం మిత్రపక్షంగా ఉన్న బీజేపీ నుంచి కాదుసుమా… ప్రజాశాంతి పార్టీ నుంచి. దీనికి పవన్ చేయాల్సిందల్లా… జనసేనను ప్రజాశాంతి పార్టీలో విలీనం చేసి, కేఏ పాల్ తో కలిసి పనిచేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలి. అది గనుక చేస్తే… రాబోయే ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా… పవన్ కు కేంద్రమంత్రి పదవి ఇచ్చే బాధ్యత తనదని కేఏ పాల్ చెబుతున్నారు.

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ రాజకీయాల్లో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసి ఓటమి పాలైన కేఏ పాల్… ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో మరోసారి భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. దానికొసం తనవంతు కృషి తాను చేస్తానని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడిన పౌల్… కేంద్ర ప్రభుత్వం తనకు అవకాశమిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కు తన సొంత నిధులు ఇస్తానని తెలిపారు. ప్రైవేటీకరణ చేస్తే స్టీల్ ప్లాంట్ లో సుమారు 44 వేలమంది ఉద్యోగులు రోడ్డున పడతారరని అన్నారు. అనంతరం… తనను స్టీల్ ప్లాంట్ లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని పాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జనసేన అధినేతపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కేఏ పాల్. పవన్.. తన జనసేన పార్టీని మూసేసి.. ప్రజాశాంతి పార్టీలో చేరాలని.. అలాచేస్తే పవన్ ను కేంద్ర మంత్రిని చేస్తానని పాల్ తెలిపారు. బీజేపీతో పవన్ ఎందుకు అంటకాగుతునారో అర్ధం కావడంలేదని తెలిపిన ఆయన… వాళ్లేమన్నా 1000 కోట్లు ఇచ్చారా అని పవన్ ను ప్రశ్నించారు. ఆరు నెలలు ఆగితే పవన్ కు తాను అంతకంటే ఎక్కువ ఇస్తానని ఈ సందర్భంగా కేఏ పాల్ సంచలన హాట్ కామెంట్స్ చేశారు.

కాగా… మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. ఇప్పటం పర్యటన సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్.. ఒకేలా ప్రవర్తించారని, ఇద్దరూ ఒకే టైపు అని ఏపీ మంత్రులు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే!