కేఏ పాల్ ‘మెగా’ ఉతుకుడు… జనసేన విలీనం ధర ఇదేనంట!

పవన్ కల్యాణ్ పేరెత్తితే అంతెత్తున లేచి పడిపోతున్న వారిలో కేఏ పాల్ కూడా ఒకరు. తమ్ముడూ.. పవన్ తమ్ముడూ.. అంటూనే చెడుగుడు ఆడేస్తుంటారు. ఇందులో భాగంగా తాజాగా చిరంజీవితో కలిపి పవన్ ని ఉతికేసినంత పనిచేశారు కేఏ పాల్. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి… జనసేన అధినేత పవన్ పై కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అవును… 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటినుంచి నేటి జనసేన వరకూ మెగా బ్రదర్స్ కాపులకు ద్రోహం చేస్తున్నారని కేఏ పాల్ మండిపడ్డారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడే… వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు, పార్టీని ఎప్పటికైనా కాంగ్రెస్‌ లో కలిపేస్తారు అని తాను చెప్పానని కేఏ పాల్ చెబుతున్నారు.

నాడు తాను అన్నట్లుగానే చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారని. అలా విలీనం చేయడానికి ఐదు వేల కోట్లు తీసుకున్నాడని అన్నారు. ఇదే సమయంలో ప్రజారాజ్యం పార్టీలో టిక్కెట్లు కోసం 1,500 కోట్లు కలెక్ట్ చేశారని ఆరోపించారు. భార్యల బంగారం అమ్ముకొని అప్పట్లో కాపులు ప్రజారాజ్యం పార్టీలో టికెట్లు కొనుక్కున్నారని పాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అసలు మోడీని గెలిపించాలంటున్న పవన్‌ కల్యాణ్‌, చిరంజీవికి.. బుద్ధి, సిగ్గు ఏమాత్రమైనా ఉందా? అని పాల్ తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాలను మోసం చేస్తున్న మోడీని సమర్థిస్తున్న చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల ను ఆదరించొద్దని ఏపీ ప్రజలకు సూచించారు. జనసేనలో బిహైండ్ ది స్క్రీన్ చిరంజీవి ఉన్నారని.. ఆయన ఎంతో మంచోడిలా నటిస్తారు కానీ, లోపల అంతా కుతంత్రమే ఉంటుందని వైరల్ వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో త్వరలో జనసేనను బీజేపీలో కలిపేస్తారని.. అందుకోసం కూడా ఐదువేళ కోట్లు తీసుకుంటారని పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీకి కేఏ పాల్ ఛాలెంజ్ విసిరారు. చిరంజీవి, పవన్ కల్యాణ్‌, అరవింద్, నాగబాబులకు ఛాలెంజ్ అంటు… “రాజమండ్రిలో పవన్ కల్యాణ్‌ గానీ, చిరంజీవిగానీ పోటీ చేయమనండి.. నేనూ పోటీ చేస్తాను.. ఎవరు గెలుస్తారో చూద్దాం.. వారికి డిపాజిట్లు కూడా రావు” అని జోస్యం చెప్పారు పాల్. దీనికి ఒక కారణం కూడా చెప్పడం గమనార్హం. ఎందుకంటే.. చిరంజీవికి 18 శాతం ఓట్లు వస్తే, పవన్ కల్యాణ్ 6% మాత్రమే ఓట్లు వచ్చాయని క్లారిటీ ఇస్తున్నారు.