పవన్ అలా అయిపోయారా ? పాల్ బంపర్ ఆఫర్

కెఏ పాల్, తెలుగురాష్ట్రాల్లో ఈ పేరు వినని వారుండరు. రాజకీయాల్లో కెఏ పాల్ అంటే ఓ పెద్ద కమెడియన్ లెక్క. అటువంటి పాల్ కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. జనసేనను గనుక ప్రజాశాంతిపార్టీలో కలిపిస్తే పవన్ కల్యాణ్ తానే ముఖ్యమంత్రిని చేస్తానంటూ నిజంగా బంపర్ ఆఫరే ఇచ్చారు. ఇంతకీ ప్రజాశాంతి పార్టీ అంటే ఏమిటో అనుకునేరు ? ఒకపుడు కెఏ పాల్ పెట్టిన రాజకీయ పార్టీనే సుమా. అప్పుడెప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశ్యంతో పాల్ ప్రజాశాంతి పేరుతో  రాజకీయ పార్టీ పెట్టారు లేండి. తర్వాత ఆ పార్టీ ఏమైందో ఎవరికీ తెలీదనుకోండి అది వేరే సంగతి.

 

ఇంత కాలానికి పాల్ హఠాత్తుగా ఊడిపడ్డారు. ఈమధ్య టివి ఆన్ చేయగానే ఎవరో కుర్రాడు ఆవేశంగా ప్రసంగిస్తు కనిపించాడట. ఎవరా కుర్రాడని పక్కనున్న వాళ్ళని అడిగితే జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టినట్లు చెప్పారట. సినిమాల్లో కూడా ఉంటాడని చెప్పి అతని పేరు పవన్ కల్యాణ్ అని చెప్పారట. తర్వాత కాసేపు పవన్ ప్రసంగాన్ని విన్న తర్వాత కుర్రాడిలోని ఆవేశం, తపన తనకు నచ్చాయట. వెంటనే ఆ కుర్రాడిని గనుక తన దగ్గరకు తీసుకొస్తే కాసేపు మాట్లాడుతానని కూడా తన వాళ్ళకి చెప్పారట పాల్. అంటే పవన్ కల్యాణ్ ఎవరో కూడా పాల్ కు తెలీదన్నమాట.

 

ఆ మాటను నేరుగా చెప్పకుండానే చిరంజీవి గురించి మాత్రం మాట్లాడాడు. ప్రజారాజ్యంపార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయటం తనకేమీ నచ్చలేదట. విలీనం ముందు తనతో చిరంజీవి ఒక్క మాట కూడా చెప్పకుండా తప్పు చేశాడని పాల్ ఇఫుడు చెప్పారు. చిరంజీవి గురించి తెలిసిన పాల్ కు యువరాజ్యం అధ్యక్షునిగా పనిచేసిన పవన్ కల్యాణ్ తెలీకుండానే ఉంటుందా ? సరే ప్రస్తుతానికి వస్తే పవన్ కు రాజకీయాలు పెద్దగా తెలీవని పాల్ అభిప్రాయపడ్డారు. కాబట్టి పవన్ గనుక తనతో కలిస్తే ముఖ్యమంత్రిని చేసే బాధ్యత తనదే అంటూ పాల్ హామీ కూడా ఇచ్చేశారు.

 

రాజకీయాలు చేసేంత డబ్బు పవన్ దగ్గర లేదట. ఆ డబ్బు తెచ్చే మార్గం తన దగ్గరుందట. పవన్ ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రాభివృద్ధి కోసం లక్ష కోట్ల రూపాయలను తీసుకొస్తానని చెబుతున్నారు. పార్టీ విలీనం గురించి పాల్ చెప్పగానే అందరిలోను ఓ అనుమానం మొదలైంది. ఎన్నికల తర్వాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేసినట్లుగానే జనసేనను కూడా పవన్ ఏదైనా పార్టీలో కలిపేస్తాడన్న అనుమానం పాల్ లో మొదలైనట్లుంది. అందుకనే బస్సుల్లో సీట్ల కోసం కర్చీఫ్ వేసినట్లుగా పాల్ ముందుగానే పవన్ తో ఒప్పందం చేసుకుంటున్నారు. పవన్ కు ఇంత బంపర్ ఆఫర్ ఇంత వరకూ ఎవ్వరు ఇవ్వలేదు. కాబట్టి పాల్ ఇచ్చిన ఆఫర్ ను వెనక్కు తీసుకోకముందే పవన్ తొందరపడటం మంచిదేమో ఆలోచిస్తే మంచిది.