జూనియర్ ఎన్టీయార్ ఎప్పుడు తేల్చుకుంటాడో మరి.!

‘దేవర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు జూనియర్ ఎన్టీయార్. ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకుంటున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్.! కొత్త ప్రపంచంలోకి ‘దేవర’ ప్రేక్షకుల్ని తీసుకెళ్ళబోతున్నామన్న నందమూరి కళ్యాణ్ రామ్, క్వాలిటీ విషయంలో అస్సలేమాత్రం కాంప్రమైజ్ కావడంలేదని చెప్పాడు.

ఇక, రాజకీయాల ప్రస్తావన వస్తే, కాస్తంత తటపటాయించిన కళ్యాణ్ రామ్, ‘ఆలోచించి చెప్తాం’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఒకింత హాట్ టాపిక్ అవుతున్నాయి. అది 2009 ఎన్నికల ప్రచార సమయం. జూనియర్ ఎన్టీయార్, రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. గాయాలపాలై, చికిత్స పొందుతున్న సమయంలో, మంచమ్మీద నుంచి దిగలేని పరిస్థితుల్లోనూ.. ఆ బెడ్ మీదనుంచే ఎన్నికల ప్రచారం చేసేశాడు.

కానీ, ఆ తర్వాత ఏం జరిగింది.? జూనియర్ ఎన్టీయార్‌ని టీడీపీ దూరం పెట్టింది. అయినాగానీ, టీడీపీతోనే తన ప్రయాణం.. అన్నట్టుగా వుండిపోయాడు జూనియర్ ఎన్టీయార్. అయితే, 2024 ఎన్నికలకు సంబంధించి జూనియర్ ఎన్టీయార్ ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు కనిపిస్తోంది. ‘తమ్ముడు, నేను కలిసి ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటాం’ అని కళ్యాణ్ రామ్ తాజాగా సెలవిచ్చాడు.

ఇందులో అంతలా ఆలోచించుకోవడానికి ఏముందో ఏమో.! ‘టీడీపీకి మద్దతిస్తున్నాం.. టీడీపీని వ్యతిరేకిస్తున్నాం. రాజకీయాలకు దూరంగా వున్నాం..’ అని ఏదో ఒక సమాధానం చెప్పేయొచ్చు కదా.? టీడీపీలో జూనియర్ ఎన్టీయార్ ఉనికిని చంద్రబాబు, నారా లోకేష్ మాత్రమే కాదు, నందమూరి బాలకృష్ణ కూడా జీర్ణించుకోలేరన్నది బహిరంగ రహస్యం. అందుకే, టీడీపీని తరచూ జూనియర్ ఎన్టీయార్ అభిమానులు ర్యాగింగ్ చేస్తుంటారు.

చంద్రబాబు ముందర జూనియర్ ఎన్టీయార్ జెండాల్ని ప్రదర్శిస్తుంటారు.. రెచ్చగొడుతుంటారు. సోషల్ మీడియాలో అయితే, ఈ ర్యాగింగ్ వేరే లెవల్‌లో వుంటుందనుకోండి.. అది వేరే సంగతి.