జూనియర్ ఎన్టీయార్ చేతికి టీడీపీ పగ్గాలు.?

జూనియర్ ఎన్టీయార్‌కి తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఇచ్చేయాలట.! ఈ డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తున్నదే. ఇప్పుడది ఇంకాస్త గట్టిగా వినిపిస్తోందంతే. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో, టీడీపీ పగ్గాలు తిరిగి నారా నుంచి నందమూరికి దక్కాలన్న వాదనలో కొంత న్యాయమూ లేకపోలేదు.!

కానీ, చంద్రబాబు తర్వాత లోకేష్‌కి పార్టీ పగ్గాలు దక్కుతాయ్ తప్ప, నందమూరి కుటుంబానికెలా.? ఆ ఛాన్సే లేదు. కానీ, జూనియర్ ఎన్టీయార్ అభిమానులు మాత్రం, తమ అభిమాన నటుడికి పార్టీ పగ్గాలు దక్కితే, చక్రం తిప్పేస్తాడంటున్నారు. ‘ఆ తిప్పాడులే.. గతంలో టీడీపీ తరఫున ప్రచారం చేశాడు.. దాని వల్ల టీడీపీకి ఒరిగిందేంటి.?’ అని టీడీపీలోని నారా అభిమానులు అదే టీడీపీలోని నందమూరి అభిమానుల మీద సెటైర్లేస్తున్నారట.

ఇంతకీ, బాలయ్య సంగతేంటి.? సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎందుకు ఇప్పుడు టీడీపీ బాధ్యతలు తీసుకోకూడదు.? నిజానికి, బాలయ్య టీడీపీ బాధ్యతలు తీసుకుంటే, వున్నపళంగా పార్టీకి కొంత ఊపు వస్తుంది. కానీ, బాలయ్య నిలకడలేని వ్యక్తి. రాజకీయాలు అస్సలు చేతకాదు.

ఏదో అలా టీడీపీ ఎమ్మెల్యేగా నెట్టుకొచ్చేస్తున్నారంతే.! బావ చంద్రబాబు కోసం బావమరిది బాలకృష్ణ రోడ్డెక్కి ఆందోళన చేసే పరిస్థితి కూడా లేదిప్పుడు.! అంత ఓపిక, తీరిక బాలయ్యకి లేవు.! అసలు నందమూరి బాలకృష్ణ సీరియస్ పొలిటీషియన్ కూడా కాదు.

జూనియర్ ఎన్టీయార్ కూడా ఇప్పుడప్పుడే రాజకీయాల గురించిన ఆలోచన చేయలేడు.! సినిమాల్లో అతని స్టార్‌డమ్ అలా వుంది. రాజకీయాల్లోకి వస్తే, సినీ స్టార్‌డమ్ సర్వనాశనమైపోతుందని జూనియర్ ఎన్టీయార్‌కి తెలుసు. అందుకే, చంద్రబాబు అరెస్టుపై నందమూరి కుటుంబ సభ్యుడిగా కూడా జూనియర్ ఎన్టీయార్ స్పందించలేదు.