నందమూరి ఫ్యామిలీలో రెండో తరంలో అటు హరికృష్ణ, ఇటు బాలకృష్ణ సినిమాల్లో రాణించారు. తర్వాత మూడో తరంలో జూనియర్ ఎన్ టీఆర్, నందమూరి కల్యాణ్ రాం లు నిలదొక్కుకున్నారు. ఇక ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పేపనే లేదు. అతడొక యూత్ ఐకాన్.. గ్లోబల్ స్టార్.. మాస్ హీరో! సామాజిక, రాజకీయ అంశాలపై ఆయనకున్న అవగాహన అంతకముంచి అని అంటారు. తాతగారు పెట్టిన పార్టీకోసం ఎంతో కష్టపడి పనిచేశారు.
ఇందులో భాగంగా 2009 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చారు జూనియర్. ఉమ్మడి ఏపీలో అనేక జిల్లాలలో తిరిగి వందకు పైగా నియోజకవర్గాల్లో టీడీపీ తరఫున తన దైన స్పీచ్ తో ఆకట్టుకున్నారు. కట్ చేస్తే… ఎన్నికల అనంతరం జూనియర్ సినిమాల్లో బిజీ అయిపోయారు! తర్వాత రాష్ట్రం విడిపోవడం, విభజిత ఏపీలో 2014, 2019 ఎన్నికల్లో జూనియర్ ఎక్కడా కనిపించలేదు. కనీసం ఆయన ఫోటోలు, బ్యానర్లూ కనిపించనీయలేదు!
అయితే ఇదంతా లోకేష్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునే అని అప్పట్లో కామెంట్లు వినిపించాయి. జూనియర్ ఎన్టీఆర్ వస్తే… లోకేష్ ను కేడర్ పరిగణలోకి తీసుకోరనే కామెంట్లు బలంగా వినిపించాయి. అదే కారణమో మరో కారణం ఉందో తెలియదు కానీ… తన సభల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు, బ్యానర్లు కనిపిస్తే… వారిని పక్కకు ఈడ్చేయండి అని చంద్రబాబు సీర్యస్ అయిన సందర్భాలు లేకపోలేదు!
కట్ చేస్తే… జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా రాజకీయాలపై కానీ, టీడీపీ పార్టీకి సంబంధించిన విషయాలపై కానీ స్పందించడం మానేశారు. తన సినిమాలు తాను చేసుకుంటూ.. ఆర్.ఆర్.ఆర్. తో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు.. ఇకపై పాన్ ఇండియా స్థాయి సినిమాలు తీస్తూ నటుడిగా మరింత బాధ్యతను భుజాలకెత్తుకున్నారు. ఈ సమయంలో మరోసారి అత్యంత కీలకమైన ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి డూ ఆర్ డై అని చెప్పినా అతిశయోక్తి కాదు!
ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ కాంపెయినర్ పార్టీకి పనిచేస్తే ఆ లెక్కే వేరుంటుంది. కానీ… ప్రస్తుతం ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే… నూటికీ 99.9% లేవనే వారే ఎక్కువ.. ఉండకూడదని కోరుకునే వారి సంఖ్య కూడా ఎక్కువే! ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చే అంశంపై హీరో కల్యాణ్ రాం ఒక ప్రశ్నను ఎదుర్కొన్న్నారు. దానికి సమాధానంగా ఆయన రియాక్షన్ వైరల్ గా మారింది.
2024లో ఏపీలో జరిగే ఎన్నికల్లో ఎటు వైపు అనే ప్రశ్నకు కాసేపు ఆలోచించిన కళ్యాణ్ రాం… ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. ఇందులో భాగంగా… ఆ ప్రశ్నకు సమాధానం తాను చెప్పలేను అని అన్నారు. తమ కుటుంబం అంతా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది అని తెలిపారు. కుటుంబం అంటే… తాను తారక్ అని స్పష్టం చేశారు. అంటే జూనియర్ – కళ్యాణ్ రాం ఇద్దరూ కలసి ఒక డెసిషన్ తీసుకుని ముందుకు వస్తారన్న మాట.
ఇప్పుడు ఈ సమాధానం హాట్ టాపిక్ గా మారింది. అన్నదమ్ములిద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్న తర్వాత… టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తారా.. లేక, సైలంట్ గా ఉంటూ సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తారా అన్నది ఆసక్తిగా మారింది. మొదటిది అయితే ఓకే… రెండో నిర్ణయమే ఫైనల్ అయితే మాత్రం అది పరోక్షంగా టీడీపీకి కనిపించని నష్టమే అనేది పలువురి అభిప్రాయంగా ఉంది.
కారణం… జూనియర్ – కల్యాణ్ రాం లు తీసుకునే నిర్ణయాలు చాలా విమర్శలకు బలం చేకూర్చే అవకాశం ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా నందమూరి తారకరామారావుకి అసలు సిసలు వారసుడు జూనియర్ ఎన్ టీఆర్ అనేది వారి అభిమానుల్లో ఎక్కువ శాతం మంది బలంగా నమ్ముతారని అంటారు. ఇదే సమయంలో ఇప్పుడున్న టీడీపీ నందమూరి టీడీపీ కాదు, నారా టీడీపీ అని కొడాలి నాని వంటి నేతలు పదే పదే గుర్తు చేస్తుంటారు.
ఇదే సమయంలో… నారా వారి చేతుల్లో పార్టీ భ్రష్టుపట్టిపోయిందని, టీడీపీకి పునర్వైభవం రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ కి పగ్గాలు అప్పగించాలని కూడా కొందరు సలహాలిస్తుంటారు. ఓ దశలో పార్టీలో కూడా ఇలాంటి భిన్నస్వరాలు వినిపించినప్పటికీ… చంద్రబాబు ఎక్కడికక్కడ వాటిని అణచివేశారు. అనంతరం మరోసారి ఆ చర్చ రాకుండా జూనియర్ ని వ్యూహాత్మకంగా దూరం పెట్టారని అంటారు. మరి… ఇన్ని ట్విస్టుల మధ్య జూనియర్ – కల్యాణ్ రాం లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది అత్యంత ఆసక్తికలిగించే అంశం అనడంలో సందేహం అక్కరలేదు!