బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హైద్రాబాద్‌లోని ఫిలిం సిటీకి వెళ్ళి మరీ ‘ఈనాడు’ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుని కలిశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణతోనూ భేటీ అయ్యారు జేపీ నడ్డా.
ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడు, మీడియా సంస్థల అధిపతుల్ని కలవడాన్ని ఇంకోలా చూడాల్సిన పని లేదు మామూలుగా అయితే.! కానీ, ఈనాడు.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. ఈ రెండూ టీడీపీ అనుకూల మీడియా సంస్థలు. అనుకూల మీడియా సంస్థలేంటి.? అవి పనిచేస్తున్నదే టీడీపీ కోసం.
రామోజీరావు మీద అయితే, మార్గదర్శి స్కామ్ పేరుతో ఆరోపణలున్నాయి. ఆయన్ని ఏ క్షణంలో అయినా ఏపీ సీఐడీ అరెస్టు చేస్తుందన్న ప్రచారాన్ని నిత్యం చూస్తూనే వున్నాం. అలాంటి రామోజీరావుతో జేపీ నడ్డా సమావేశాన్ని ఎలా చూడాలి.?
టీడీపీ – బీజేపీ పొత్తు దిశగా, బీజేపీ జాతీయ నాయకత్వం, టీడీపీ రాజగురువు అయిన రామోజీరావుతో భేటీ అయ్యిందన్నది బహిరంగ రహస్యం. ‘బీజేపీ కూడా మాతో కలిసి వస్తుందని ఆశిస్తున్నా..’ అంటూ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై జనసేన అధినేత వ్యాఖ్యానించిన కొద్ది గంటల్లోనే, బీజేపీ జాతీయ నాయకత్వం, టీడీపీ రాజగురువుతో భేటీ అయ్యింది.
రాజకీయాలన్నాక ఇలాంటివి మామూలే. బీజేపీకి ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కీలకం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతోపాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలూ జరుగుతాయా.? అన్నదానిపై స్పష్టత లేదు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే రామోజీరావుతో, రాధాకృష్ణతో జేపీ నడ్డా భేటీ అయ్యారు. అదే సమయంలో, ఏపీ రాజకీయాలూ ఈ భేటీలో చర్చకు వచ్చే వుంటాయి.