సోమవారం జరిగిన పవన్ కల్యాణ్ పర్యటన వెనుక ఒక అసత్య ప్రచారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. “జనసేన అధినేత కారణంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరు కాలేక 30 మంది విద్యార్థులు బాధపడ్డారు” అంటూ పలు ఫేక్ పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే వాటికి తగిన సమాధానంగా విశాఖ నగర పోలీసులు సోమవారం రాత్రికే స్పష్టతనిచ్చారు. నిజానికి పవన్ కాన్వాయ్ వెళ్లిన సమయం, పరీక్షా కేంద్రాలకు చేరవలసిన గడువు మధ్య ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు.
పోలీసుల ప్రకటన ప్రకారం, జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరు కావాలంటే ఉదయం 7 గంటలకే విద్యార్థులు కేంద్రంలో రిపోర్ట్ చేయాలి. గేట్లు 8.30కి మూసేస్తారు. అదే సమయంలో పవన్ కాన్వాయ్ విశాఖలోని పెందుర్తి ప్రాంతం మీదుగా ఉదయం 8.41కి వెళ్లింది. అంటే అప్పటికే గేట్ మూసిన తర్వాత. అందుకే ఈ ప్రయాణం పరీక్షకు ఏ మాత్రం ఆటంకం కలిగించలేదని అధికారికంగా తేలింది.
ఇంకా చెప్పాలంటే, ఆరోజు పరీక్షా కేంద్రానికి గైర్హాజరైన 30 మంది సంఖ్య సాధారణం కంటే తక్కువగానే ఉంది. గత మూడు రోజుల్లో ఆ కేంద్రంలో 81, 65, 76 మంది వరుసగా గైర్హాజరయ్యారు. ఇవన్నీ ఆలస్యంగా వచ్చినవాళ్లను కూడా కలిపిన గణాంకాలే కావడం గమనార్హం. సోమవారం రికార్డ్ అయిన 30 మంది గైర్హాజరీకి ప్రత్యేక కారణాలేమీ లేవని పోలీసులు తెలిపారు. ఇంతకుముందు కూడా రాజకీయ నాయకుల పర్యటనల వల్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడ్డాయన్న ఆరోపణలు వచ్చిన సందర్భాలు ఉన్నా, అవన్నీ నిజం కావు. తాజాగా పవన్ కల్యాణ్‌పై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తేలిపోయాయి. పోలీసుల క్లారిటీతో ఈ వివాదానికి ముగింపు పడినట్టే.