పవన్ కళ్యాణ్ పిలుపు కోసం జేడీ లక్ష్మినారాయణ వెయిటింగ్.!

సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు. అయితే, ఏ పార్టీ నుంచి.? అన్నది మాత్రం చెప్పడంలేదు. ‘నా భావజాలం నచ్చి, నాతో పని చేయాలనుకునే పార్టీ నుంచి మాత్రమే నేను పోటీ చేస్తాను..’ అంటూ తాజాగా ఇంకోసారి క్లారిటీ ఇచ్చారు జేడీ లక్ష్మినారాయణ.

అసలు పేరు వీవీ లక్ష్మినారాయణ అయినా, సీబీఐ జేడీగా వచ్చిన గుర్తింపు నేపథ్యంలో ఆయన పేరు కాస్తా జేడీ లక్ష్మినారాయణగా స్థిరపడిపోయింది. జేడీ లక్ష్మినారాయణ లోక్ సభకు పోటీ చేస్తారు. మరోపక్క, ఆయన కుమార్తె అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నారు. వివిధ పార్టీలు జేడీతో ఇప్పటికే సంప్రదింపులు జరిపాయి. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్ష పదవిని తొలుత జేడీ లక్ష్మినారాయణకే ఆఫర్ చేశారట. ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ఇలాంటి ఆఫర్‌తోనే ఆయన్ని సంప్రదించింది. జేడీ లక్ష్మినారాయణను బీజేపీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు గతంలోనూ జరిగాయి, ఇప్పుడూ జరుగుతున్నాయి.

గత ఎన్నికల సమయంలో కూడా జేడీ లక్ష్మినారాయణ అటూ ఇటూ ఊగి.. చివరికి జనసేనలో కలిశారు. రాజకీయాల్లో నిర్ణయాలు తీసుకునే వేగం కూడా ఒక్కోసారి కీలకమవుతుంది. త్వరగా నిర్ణయం తీసుకుంటే, ఆ పార్టీ తరఫున.. ఆ నియోజకవర్గంలో పనులు చేసుకోవడానికి అవుతుంది.

2019లో చేసిన తప్పదిమే జేడీ లక్ష్మినారాయణ ఇంకోసారి ‘వేచి చూసే ధోరణిలో’ తప్పు చేస్తే, వచ్చే ఎన్నికల్లోనూ ఆయన గెలవడం కష్టం. కాగా, జనసేన నుంచి తనకు పిలుపు వస్తుందని జేడీ లక్ష్మినారాయణ గట్టి నమ్మకంతో వున్నారట. పిలుపు రాగానే, జనసేనలోకి ఆయన వెళ్ళడం ఖాయమంటున్నారు.