బిగ్ బాస్ నిర్వహించాల్సింది వారితో కాదు వీరితో

జేడీ లక్ష్మీనారాయణ ఈ పేరు తెలియని వారుండరు. సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసి జగన్ కేసును సవాల్ గా తీసుకొని దోషులందరిని న్యాయస్థానం ముందు నిలబెట్టారు. అప్పటి నుంచే ఆయన పాపులర్ అయ్యారు. ఆ తర్వాత మహారాష్ట్ర కేడర్ కు వెళ్లినా ఇటీవలే స్వచ్చంద పదవీ విరమణ చేసి సామాజిక సేవకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఆయన అనేక వేదికల మీద ఉపన్యాసాలు ఇస్తూ యువతలో మార్పు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు.

ఇటీవల బిగ్ బాస్ షోపై జేడీ లక్ష్మీనారాయణ తీవ్రంగా స్పందిస్తున్నారు. బిగ్ బాస్ షోను చూసి యువత నిత్యం రెండు గంటల సమయం వృథా చేసుకుంటుందని, దాని విలువైన సమయంతో పాటు విలువైన ఆలోచనా శక్తిని కూడా కోల్పోతున్నామని జేడి అన్నారు. బిగ్ బాస్ అందరి మైండ్ కంట్రోల్ చేస్తారని, బిగ్ బాస్ మైండ్ ను ఎవరూ కంట్రోల్ చేయరని అన్నారు. తాజాగా బిగ్ బాస్ షోపై జేడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ షోను స్టార్స్, పేరున్న వారితో కాకుండా రైతులతో నిర్వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు. సామాజిక వర్గం కన్నా సమాజమే ముఖ్యమని ప్రజాస్వామ్యం వైపు పూర్తిగా ప్రజలు తమ ఆలోచనలను మళ్లీంచాలని ఆయన అన్నారు. రైతులు దేశానికి అన్నం పెట్టే వారని, వారు చల్లగా ఉంటేనే మన నోట్లోకి నాలుగు వేళ్లు పోతాయన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఎక్కడో చాటున ఉండి దేశానికి అన్నం పెడుతున రైతును సమాజానికి చూపించాలని అందుకే రైతులతో బిగ్ బాస్ షో నిర్వహించాలన్నారు. యువత పనికిరాని వాటి కోసం ఆలోచించి సమయం వృధా చేసుకోవద్దని జేడీ సూచించారు.

జేడీ లక్ష్మీనారాయణ ఆది నుంచి కూడా బిగ్ బాస్ షోను వ్యతిరేకిస్తున్నారు. ఆయన యువతకు బాగా మోటీవేషనల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. దాంతో పాటుగా రైతు సమస్యలు తెలుసుకుంటూ వాటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఆయన పోరాడుతున్నారు. అయితే ఇటువంటి సమయంలో వస్తున్న బిగ్ బాస్ షోపై ప్రతి సభలో ప్రస్తావిస్తున్నారు. అసలు బిగ్ బాస్ షో వలన ఉన్న ఉపయోగం ఏంటీ దానికి కోట్ల రూపాయల ఖర్చు దానితో పాటు విలువైన శ్రమ, సమయం వృథా అవుతున్నాయని జేడీ వ్యాఖ్యానించారు. పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన విద్యార్థులు, తమ భవిష్యత్ తో పాటు దేశ భవిష్యత్ గురించి ఆలోచించాల్సిన యువత బిగ్ బాస్ షోని చూడటం కోసం రెండు గంటల సమయం వృధా చేసుకుంటుందన్నారు.

సమాజానికి వ్యతిరేకంగా ఉన్న ఏ అంశంపైనైనా జేడీ లక్ష్మీనారాయణ తీవ్రంగా స్పందిస్తున్నారు.అంతే వేగంగా ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆయనపై ప్రజలకు అభిమానం పెరుగుతుంది. ముక్కు సూటిగా వ్యవహరించే జేడీ తీరు అందరికీ తెలిసిందే. చిన్న వ్యాఖ్యలకే పెద్ద దుమారం రేపే తెలుగు సినిమాలో కొంత మంది నటులు కూడా ఆయన వ్యాఖ్యలపై స్పందించలేదు. ఎందుకంటే జేడీ లక్ష్మీనారాయణ అన్ని తెలిసిన వాడు, సమాజంపై అవగాహన ఉన్నవాడు దాంతో పాటు అన్ని పక్కాగా ఉంటేనే ఆయన వ్యాఖ్యలు చేస్తారు లేకపోతే చేయరు. అందుకే జేడీ వ్యాఖ్యలపై స్పందించడానికి ఏ నటుడు కూడా ముందుకు రావడం లేదు. ప్రోగ్రాం నిర్వాహకులు కూడా జేడీ వ్యాఖ్యలపై స్పందించలేదంటే జేడీ ఎంత పక్కాగా ఉంటేనే మాట్లాడుతారో అర్ధమవుతుంది. బిగ్ బాస్ షో పై జేడీ వ్యాఖ్యలో యువతలో బాగా చర్చ అవుతుంది.అవును జేడీ సారు చెప్పింది నిజమే కదా అన్న సోయి వారికొచ్చిందని పలువురు అంటున్నారు.