రోజుకో మలుపు తిరుగుతున్న జయరాం హత్య కేసు

వ్యాపారవేత్త జయరామ్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా అనుమానించిన శిఖా చౌదరికి హత్యతో ఎటువంటి సంబంధం లేదని పోలీసులు తేల్చారు. దీంతో జయరాం భార్య పద్మశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు రెండు సార్లు పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. దీంతో శిఖా చౌదరికి త్వరలోనే నోటిసులిస్తామని పోలీసులు అన్నారు.  అదే విధంగా రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ లను తమకు అప్పగించాలని పోలీసులు పిటి వారెంట్ ను జారీ చేశారు. కోర్టు అనుమతితో వారిని నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.   

శిఖా చౌదరి ఆరోపణలపై, జయరామ్‌‌పై వస్తున్న పుకార్లపై, మరీ ముఖ్యంగా ఆయనకు అమ్మాయిల పిచ్చి ఉందంటూ వస్తున్న ఆరోపణలపై చిగురుపాటి సతీమణి పద్మశ్రీ ఫస్ట్ టైమ్ స్పందించారు. తన భర్త ‘ఉమనైజర్’ కాదని.. మా మధ్య 30 ఏళ్ల బంధం ఉందని చెప్పుకొచ్చారు. తన భర్త ఎవరు అడిగినా సాయం చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తే తప్ప అలాంటోడు కాదని ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని పద్మశ్రీ కొట్టిపారేశారు. 

తన భర్త హత్యలో కుట్ర ఉందని పద్మశ్రీ అనుమానం వ్యక్తం చేశారు. మేనకోడలు శిఖా చౌదరినే ఈ హత్యలో కీలక సూత్రధారి అని సంచలన ఆరోపణ చేశారు. ఏపీ పోలీసులు ప్రధాన నిందితుడిగా చేర్చిన రాకేశ్ రెడ్డి పాత్రధారి మాత్రమేనని పద్మశ్రీ చెప్పుకొచ్చారు. సుమారు రెండు గంటల విచారణ అనంతరం జూబ్లిహిల్స్ పోలీసులు జయరామ్ కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకున్నారు.