బిగ్ న్యూస్: పవన్ ని జనసైనికులు కూడా క్షమించరు!

ప్రశ్నిస్తానికే పార్టీ పెట్టనని చెప్పి “జనసేన”ను స్థాపించిన పవన్ కల్యాణ్ పరిస్థితి రోజు రోజుకీ మరీ దారుణంగా తయారైపోతున్న పరిస్థితి. అభిమానులు హర్ట్ అవుతున్నారంటే.. అవ్వరా..? జనసైనికులు ఆవేదన చెందుతున్నారంటే.. చెందరా..? ఎందుకంటే… చేజేతులా చేసుకున్న కొన్ని వ్యూహాత్మక తప్పిదాల వల్ల, అర్ధజ్ఞానానికి – అజ్ఞానానికి మధ్య తీసుకున్న కొన్ని నిర్ణయాలవల్ల… పవన్ పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. ఇది జనసేనను అభిమానించేవారి ఆవేదన!

అవును… 2014లో ఏ ముహూర్తాన్న టీడీపీతో కలిశారో – బాబుకు మద్దతుగా నిలిచారో తెలియదు కానీ… నాటి నుంచి పవన్ కు పొలిటికల్ గా ఇండివిడ్యువాలిటీ పోయిందనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. నాటి ప్రతిపక్ష పార్టీ – నేటి అధికారపార్టీ ఆ విషయాన్ని జనాల్లోకి సక్సెస్ ఫుల్ గా తీసుకెళ్లగలిగింది. ఫలితంగా పొలిటికల్ గా పవన్ క్యారెక్టర్ చీప్ అయిపోయిందనే సంకేతాలు జనాల్లోకి వెళ్లిపోయాయి!

సరే జరిగిందేదో జరిగింది.. ఈసారి జనసైనికులు మాంచి కసి మీదున్నారు. అధికారంలోకి వస్తామా.. రామా.. అన్న సంగతి పక్కనపెడితే… భవిష్యత్ రాజకీయాల్లో కీలక భూమిక పోషించగలిగేలా, గౌరవమైనన్ని సీట్లు అయితే సాధించగలుగుతామని వారంతా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అయితే… వారికున్న ఆత్మవిశ్వాసం పవన్ కు లేదా..? లేక, పరిస్థితులు అలా పవన్ చేతులు కట్టేస్తున్నాయా? అనే విషయం మాత్రం అర్ధంకావడం లేదు. సమాధానం పవన్ కే ఎరుక!

ఎందుకంటే… “పవన్ రాజకీయ భవిష్యత్తుకు.. తాను అందరిలాంటి నాయకుడిని కాదని చెప్పేంటందుకు.. తనపై ఎన్నో ఆశలుపెట్టుకున్న వారి నమ్మకాలను సజీవంగా ఉంచేందుకూ”… ఆఖరి అవకాశం కళ్లముందుంది! అయినా కూడా పవన్ ఆ దిశగా ఆలోచించడం లేదు. పవన్ ని “ధమ్ముంటే 175 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీచేయాలి”! అని అధికారపార్టీ వెటకారమాడుతొంది. వారు ఏ రాజకీయ ఉద్దేశ్యంతో ఆ కామెంట్ చేశారన్న సంగతి కాసేపు పక్కనపెడితే… “పార్టీ స్థాపించి పదేళ్లైనా, బలమైన కేడర్ ఉన్నా కూడా.. అసలు ఆ మాట అనిపించుకునే స్థాయిలోనే ఇంకా పార్టీ ఉంది” అనే విషయం పవన్ గ్రహించాలి.

ఇప్పుడు పవన్ ఒంటరిగా వెళ్లగలారా? వెళ్లగలరని, వెళ్లాలని జనసైనికులు కోరుకుంటున్నారు! వచ్చేవి నాలుగు సీట్లయినా పర్లేదు… అవి మన కష్టార్జితం అని చెప్పుకుందాం అనేది వారి పౌరుషం! పోనీ టీడీపీతో కలిసి వెళ్దాం అంటే… బీజేపీ ఒప్పుకోవడం లేదు!! బీజేపీతో కలిసి వెళ్దామంటే… ఇటు టీడీపీ అంగీకరించని పరిస్థితి! పోనీ ఈ రెండింటినీ ఏదోలా ఒప్పించి వెళ్దాం అనుకుంటుంటే… బీజేపీయేతర పార్టీలతోనే పవన్ కలవాలని, కలిస్తేనే ఫ్యూచర్ ఉంటుందని కమ్యునిస్టుల కామెంట్లు! ఒంటరిగా వెళ్తే… వీరమరణమని పవన్ కు అంతర్లీనంగా ఆందోళన!

శత్రువుకి కూడా రానన్ని కష్టాలు ఇప్పుడు జనసేన పార్టీకి వచ్చాయి. “అధినేత చేసిన తప్పులు, అనాలోచిత నిర్ణయాలు, అపరిపక్వ ఆలోచనలు… సరైన సలహాదారులు లేని ఫలితాలు… ఉన్న సలహదారులు కూడా గిరి గీసుకుని కూర్చుని అందులో నుంచే ఆలోచించడాలు”… వెరసి పవన్ రాజకీయ భవిష్యత్తును – మరిముఖ్యంగా జనసేనను నమ్ముకున్న లక్షలాదిమంది జనసైనికుల ఆశలను గాళ్లో వేళాడదీస్తున్నాయి!

ఇప్పటికైనా మునిగిపోయిందేమీ లేదనుకుంటే… “వారాహిని బయటకు తీసి, ముఖానికేసుకున్న రంగును కొంతకాలం తుడిచేసి, జనాల్లోకి వస్తే.. ఆదరించడానికి రెడీగా ఉంది” జనసైనిక లోకం. పవన్ దే ఆలస్యం. అదే ఆలస్యాన్ని, అవివేకాన్నీ, అర్థజ్ఞానాన్ని , అవగాహనా రాహిత్యాన్ని కంటిన్యూ చేస్తే మాత్రం… పవన్ ని ఫ్యూచర్ లో జనసైనికులు కూడా క్షమించరు.!