సభలు, సమావేశాలు.. రోడ్ షోలకు అనుమతి లేదంటూ, అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేయడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14 నుంచి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే.
సరిగ్గా ఈ పర్యటనకు కొద్ది రోజుల ముందర, పోలీస్ ఉన్నతాధికారులు, సెక్షన్ 30 అనీ.. ఇంకోటనీ, ఆంక్షలు విధించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పార్టీలు.. సభలు, సమావేశాలు నిర్వహించడం సర్వసాధారణం. రోడ్ షోలు, బస్సు యాత్రలు.. ఇవన్నీ రాజకీయ పార్టీలకు వాటి జన్మ హక్కు.. అనుకోవాలేమో.!
గతంలో వైసీపీ కూడా రోడ్ షోలు నిర్వహించింది.. బహిరంగ సభలూ నిర్వహించింది. అప్పుడెప్పుడూ ఇలాంటి ఆంక్షలు లేవు. రాజకీయ పార్టీలు.. రాజకీయ విమర్శలు చేసుకోవడం మామూలే. అధికారంలో ఎవరున్నా, రాజకీయ పార్టీలు నిర్వహించే కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వాల్సి వుంటుంది.. షరతులు వర్తిస్తాయనుకోండి.. అది వేరే సంగతి.
నెలలో ఓ రోజు కుదిరితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతిథిలా వచ్చి వెళుతుంటారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈసారి కొన్ని రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లోనే వుండబోతున్నారాయన. వారాహి యాత్ర ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపాలన్నది జనసేనాని వ్యూహం.
సరే, జనసేనాని టూర్ సక్సెస్ అవుతుందా.? లేదా.? అన్నది వేరే చర్చ. ఈ ఆంక్షలతో, వైసీపీ.. ప్రజల్లో పలచనైపోతోందన్నది నిర్వివాదాంశం.