జనసేనాని న్యూ లుక్.! ఏమంత ప్రత్యేకం.?

ఓ పార్టీ అధినేతకి సంబంధించి ‘లుక్’ విషయంలో అంత ప్రత్యేకత ఏముంటుంది.? పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సాధారణ చీరకట్టులో కనిపిస్తారంతే.! నిజానికి, చాలామంది రాజకీయ నాయకులు తెలుపు దుస్తుల్లో కనిపించేందుకే మొగ్గు చూపుతారు. సరే, కొందరు స్టైలిష్ లుక్‌తో దర్శనమిచ్చేందుకు ప్రయత్నిస్తారనుకోండి.. అది వేరే సంగతి. సినీ నటుడు కదా, పవన్ కళ్యాణ్ స్టైలింగ్ తరచూ చర్చనీయాంశమవుతుంటుంది. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లుక్ చాలా సాధారణం. గతంలో అయితే బాగా పెరిగిపోయిన గడ్డంతో కనిపించేవారాయన.

అసలు ఈ లుక్ గురించిన చర్చ ఎందుకు.? అంటే, ‘నేను సిద్ధం.. జనసైనికులారా మీరు సిద్ధమా.?’ అంటూ జనసేన పార్టీ అధికారిక హ్యాండిల్ నుంచి ఓ ఫొటో పోస్ట్ అయ్యింది. ప్రత్యేక విమానంలో హైద్రాబాద్ నుంచి విజయవాడ చేరుకున్న పవన్ కళ్యాణ్, మిలిటరీ కార్గో ప్యాంట్, ఆపై బ్లాక్ టీ-షర్ట్‌తో కనిపించారు.

అంతే, మీడియాలో ఈ లుక్ విషయంలో చర్చోపచర్చలు షురూ అయ్యాయి. ట్రోలింగ్ కూడా అంతే స్థాయిలో జరిగింది. పవన్ కళ్యాణ్ అభిమానుల కంటే ఎక్కువగా, ఆయన్ని వ్యతిరేకించేవారు ఈ లుక్‌ని సోషల్ మీడియాలో వైరల్ చేసి పడేశారు. మరోపక్క, పార్టీ కార్యాలయానికి చేరుకోగానే, జనసేన అధినేత సాధారణ లుక్‌లోకి మారిపోయారు. అయినాసరే, ‘స్పెషల్ ఫ్లైట్ లుక్’ మాత్రం వైరల్ అవుతూనే వుంది. ఈ మొత్తం వ్యవహారం మీడియా వింత పోకడల్ని చెప్పకనే చెబుతోంది.