టీడీపీలోనూ గుబులు రేపుతున్న జనసేన సర్వే.!

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి దాదాపుగా 40 నుంచి 60 సీట్లు మాత్రమే వస్తాయని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పిన విషయం విదితమే. మరి, మిగతా సీట్లు ఎవరికి వస్తాయ్.? జనసేనకా.? టీడీపీకా.? ఈ విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోస్యంలో స్పష్టత కనిపించలేదు.

‘మేం అధికారంలోకి వస్తాం..’ అంటున్నారు జనసేనాని. గెలుపు మీద కక్కుర్తి లేదంటారు అదే పవన్ కళ్యాణ్. గెలిపించమంటారు.. ఇంకోటేదో చెబుతారు. ఎలా చూసినా పవన్ కళ్యాణ్ నుంచి ఏ విషయమ్మీదా స్పష్టత కనిపించదు. విజయదశమి తర్వాత జనంలో వుంటానన్నారు, ఇప్పుడేమో.. ఈ ఏడాదిలో కుదరదని సెలవిచ్చేశారు.

ఇదిలా వుంటే, జనసేన పార్టీ చెప్పిన జోస్యం మీద వైసీపీ గుస్సా అయ్యింది. నానా తిట్లూ తిట్టేశారు పవన్ కళ్యాణ్‌ని వైసీపీ నేతలు. మాజీ మంత్రి పేర్ని నాని, ప్రస్తుత మంత్రి రోజా.. ఇలా అంతా చెడుగుడు ఆడేశారు. దానికి జనసేన నుంచి కూడా కౌంటర్ ఎటాక్ గట్టిగానే కనిపిస్తోంది. ఇదంతా ఓ యెత్తు. ఇంతకీ, టీడీపీ పరిస్థితేంటి.? వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయని జనసేన అనుకుంటోంది.? ఈ విషయమై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో.

‘టీడీపీకి కూడా అదే స్థాయిలో సీట్లు రావొచ్చు.. కొన్ని తక్కువ సీట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు వైసీపీతో పోల్చితే. జనసేన పార్టీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అప్పుడెలాగూ జనసేనకు టీడీపీ మద్దతివ్వక తప్పదు..’ అని జనసేన నాయకులు అంటున్నారు.

నిజానికి, 2019 ఎన్నికల సమయంలో కూడా ఇదే ఈక్వేషన్ జనసేన నుంచి కనిపించింది. దాంతో, జనం గంపగుత్తగా వైసీపీకి ఓట్లేశారు.. జనసేనకు వేస్తే, అది తిరిగి టీడీపీకే పడినట్లుగా ఈక్వేషన్ మారుతుందని జనం అనుకున్నారు. కానీ, అప్పటికీ ఇప్పటికీ ఈక్వేషన్స్ మారాయన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.

ఒకవేళ ఈసారి జనసేనకు అవకాశమిద్దామని ప్రజలు అనుకుంటేనో.? అన్న భయం టీడీపీని వెంటాడుతోంది. వైసీపీకి ఆ భయం లేదు. తామే తిరిగి అధికారంలోకి వస్తామని వైసీపీ గట్టిగా నమ్ముతోంది గనుక.!