విశ్లేషణ: మరో ప్రజారాజ్యంగా జనసేన… ఎవరి పాత్ర ఎంత?

పార్టీ పెట్టి పదేళ్లైంది.. ఇప్పటివరకూ పార్టీకి ఒక ఎమ్మెల్యే సీటొచ్చినా.. అధినేతకు మాత్రం ఒక్కటి కూడా రానిపరిస్థితి! నిజం చెప్పాలంటే… ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్నచందంగా జనసేన పరిస్థితి ఉందన్నా అతిశయోక్తికాదు. కారణం… పవన్ కు బలమైన ఫ్యాన్ బెల్ట్ ఉన్నా.. వారంతా జనసైనికులుగా మారినట్లు పైకి కనిపిస్తున్నా.. వారిని మరింత క్రియాశీలకంగా మార్చి, వారి అభిమానాన్ని ఓటుగా మార్చడంలో పవన్ సక్సెస్ ఫుల్ గా ఫెయిల్ అవుతున్నారు! ఈ క్రమంలో… పార్టీలో కొత్త బాధ్యతలు సంపాదించుకున్న నాగబాబు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

సూచనలు వద్దంటున్న సోదరుడు:

రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా ఉన్న నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. “పార్టీకి.. పవన్ కు ఎలాంటి సలహాలు అవసరం లేదు. ఇచ్చినా మేం తీసుకోం. పాటించం” అని తేల్చి చెప్పారు. ఇది పూర్తిగా నాగబాబు రాజకీయ అజ్ఞానాన్ని బహిరంగ పరుస్తుందని అంటున్నారు విశ్లేషకులు. పార్టీ అన్నతర్వాత అభిమానుల నుంచీ, కార్యకర్తల నుంచీ, విశ్లేషకుల నుంచీ, శ్రేయోభిలాషుల నుంచీ రకరకాల సూచనలూ, సలహాలు వస్తుంటాయి. అవి సానుకూలంగా ఆలకించాలి. వాటిని ఆచరించడం, ఆచరించకపోవడం పార్టీ అధినేత అభిష్టం.

అంతేకానీ… అసలు సూచలనే చేయకండి.. మాకు తెలిసిందే జ్ఞానం – మేము చూసిందే లోకం – మేము చేయబోయేదే రాజకీయం అనుకుంటే… ఫ్యూచర్ కి పగలు ఉండదు.. అంతా చీకటే! ఈ విషయం నాగబాబు గ్రహించాలి.. అభిమానుల సూచనలు – కార్యకర్తల సలహాలకు విలువివ్వాలి. కార్యకర్తలు అంటే బానిసలు కాదన్న విషయం గ్రహించాలి. కొన్ని సందర్భాల్లో, మరికొన్ని విషయాల్లో పార్టీ అధినేతలకంటే ఎక్కువ నాలెజ్డ్ కార్యకర్తలకుంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి.

పవన్ బందరులో చెప్పిందీ ఇదే:

అన్న ఇప్పుడు చెప్పాడు కానీ… తమ్ముడు గతంలోనే ఈ విషయం స్పష్టం చేశారు. కాకపోతే పవన్ కాస్త అటు ఇటుగా తిప్పి పొలైట్ గా చెప్పినట్లు ప్రయత్నించారు. గతంలో జరిగిన బందరు సభలో ప్రసంగించిన పవన్ కల్యాణ్… తనను అనుమానించొద్దని, తనను ప్రశ్నించొద్దని, తనను ప్రశ్నిస్తే అనుమానించినట్లేనని, అలాంటి వారు తన అభిమానులు కాదని ఎమోషనల్ టచ్ ఇచ్చారు. కానీ… కంటెంట్ మాత్రం అదే! తాను తీసుకునే నిర్ణయాలకు కార్యకర్తలు శిరసా వహించాలి కానీ… ఇదేమి అజ్ఞానపు ఆలోచన అని మాత్రం ప్రశ్నించకూడదు అని!

ప్రజారాజ్యం రోజులు గుర్తు చేస్తున్న నాగబాబు:

గతంలో ప్రజారాజ్యం స్థాపించినప్పుడు కూడా నాగబాబు ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. తనకు మాత్రమే సొంతమైన ప్రత్యేక తెలివితేటలతో కొన్ని సభలూ, సమావేశాలూ ఏర్పాటు చేసేవార! ఆ సభల్లో ప్రత్యేకంగా తమ సామాజికవర్గం వారిని మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించేవారు! కొబ్బరి తోటల్లో విందులు అరెంజ్ చేసి.. బహిరంగ ప్రసంగాలు చేసేవారు! ఫలితంగా… కులమతాలకు అతీతంగా చిరంజీవిని అభిమానించే చోట… ప్రజారాజ్యంపై కాపుముద్రను బలంగా వేయడంలో సక్సెస్ అయ్యారు. ఈ విషయాన్ని స్ప్రెడ్ చేయడంలో అప్పటి కాంగ్రెస్ నేతలు, టీడీపీ నాయకులు సక్సెస్ అయ్యారు!

మరోసారి ఆందోళనలో అభిమానులు:

రాజకీయాల్లో నాగబాబు ఎంటరైన చోట సక్సెస్ కు కాస్త ఇబ్బంది అని కొంతమంది చెబుతుంటారు ఆయన వ్యతిరేకులు! కాకపోతే అందుకు వారిచ్చే ఉదాహరణలు కాస్త ఆలోచింపచేసేవిగా ఉండటం గమనార్హం. ప్రజారాజ్యం సమయంలో జరిగిన ఎన్నికలైనా, జనసేన పోటీచేసిన ఎన్నికలైనా, ఆఖరికి “మా” ఎన్నికలైనా… నాగబాబు ఎంటరైతే నెంబర్స్ ఒక్కటే తేడా… మాత్రం రిజల్ట్ సెం టు సేం అన్నట్లుగా ఉందనేది వారి వాదన! దీంతో… అన్నీ తెలిసినా కూడా అన్నపై అభిమానంతో అంత పెద్ద బాధ్యతలు అప్పగించిన అంశంపై.. జనసేన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలతోనూ, అభిమానులతోనూ, శ్రేయోభిలాషులతోనూ కలిసిపోవడం, కలుపుకుపోవడంలో మరోసారి నాగబాబు తప్పు చేస్తున్నారని టెన్షన్ పడుతున్నారు. ఫలితంగా కక్కలేక, మింగలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

అభిమానుల తుత్తర పనులు:

టీడీపీతో పొత్తు అనేది పవన్ కల్యాణ్ సొంత నిర్ణయంగానే భావించాలి. పార్టీ ఆయనది, దానికి అధినేత ఆయన… సో, పొత్తుల విషయంలో పవన్ కు పూర్తి స్వేఛ్చ ఉంటుంది. రీజనల్ పార్టీలు ఏవైనా అధినేతలకు ఈ ఛాన్స్ ఉంటుంది. ఈ విషయంలో పవన్ ఇంకా బాబుతో చర్చలు జరుపుతున్నారు. సీట్ల విషయంలో పవన్ కాస్త గట్టిగానే ఉంటున్నట్లు కూడా కథనాలొస్తున్నాయి. కానీ ఈలోపు లోకేష్ పాదయాత్రల్లో.. జనసేన జెండాలు దర్శనమిస్తున్నాయి. ఇది కచ్చితంగా అభిమానుల తొందరపాటు పనే.

కారణం… ఇలాంటి బలహీనమైన ఆలోచనలతో కూడిన పనులు చేయడం అధినేత తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తాయో లేదో తెలియదు కానీ… చంద్రబాబుకు మాత్రం వరంగా మారతాయి. సీట్ల విషయంలో పవన్ ఏదో గట్టిగా ఉన్నట్లు కనిపిస్తున్నాడే కానీ… ఆల్రెడీ టీడీపీ లేకపోతే కష్టమే అనే కన్ క్లూజన్ కు జనసైనికులు వచ్చేశారనే ఆలోచనలోకి చంద్రబాబు వెళ్లిపోతారు. పైగా బాబు రాజకీయ చాణక్యం ముందు పవన్ ఎంత? అయినా కూడా ఏదోలా నెట్టికొస్తున్నప్పుడు… జనసైనికులు తుత్తర పనులు చేయడం ఆపాలి. పొత్తులపై క్లారిటీ వచ్చేవరకూ కాస్త సంయమనం పాటించాలి.

వీరమరణం కాదు… ఘోరమరణం:

నాగబాబు వద్దన్నా.. పవన్ చెప్పొద్దన్నా.. జనసేనకు సూచనలు చేయక తప్పని పరిస్థితి. కారణం… రాజకీయంగా జనసేన వరుస తప్పులు చేస్తుంది. ఇంతకాల చేసిన తప్పులు, అనుభవించిన ఫలితాలు తవ్వుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేదు కానీ… అవే తప్పులను పునాదులుగా చేసుకుని మరీ రాజకీయాలు చేయడమే.. అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్న అంశం. ఇకపై అయినా ఒంటెద్దు పోకడ రాజకీయాలకు జనసేన దూరంగా ఉండాలి. కలిసి పోవాలి.. కలుపుకుపోవాలి. కానిపక్షంలో వీర మరణం కాదు… ఘోర మరణం కన్ ఫాం!!