నిస్వార్ధంగా పనిచేస్తే పదవులు అవే వస్తాయి
రాజకీయాల్లోకి రాగానే ఎమ్మెల్యేలు, ఎంపీలు కాలేరు
ఒకటి, రెండు కులాల అండతో విజయం సాధించలేం
జనవరి 9 తరవాత స్వల్పకాలిక జిల్లా కమిటీలు
నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల సమీక్షా సమావేశాల్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కామెంట్స్
రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిపోదాం అనుకుంటే సాధ్యమయ్యే పని కాదనీ, పార్టీ కోసం పని చేసేవారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌కళ్యాణ్ స్పష్టం చేశారు. పార్టీ కోసం పని చేసే వారికి తప్పక గుర్తింపు వస్తుందనీ, గుర్తింపు వస్తే పదవులు వాటంతట అవే వస్తాయని చెప్పారు. పదవులు అంటే ఎమ్మెల్యే, ఎంపీలే కాదు, పార్టీ పదవులు, పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులు సైతం అందుబాటులో ఉంటాయని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ఇవన్నీ దక్కుతాయన్నారు.
జిల్లాల వారీ సమీక్షా సమావేశాల్లో భాగంగా శుక్రవారం విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల నాయకులు, కార్యకర్తలతో విడివిడిగా సమావేశం అయి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ… “పేరు ప్రఖ్యాతులు, డబ్బు ఉన్నంత మాత్రాన పార్టీలు స్థాపించి వాటిని విజయవంతంగా నడిపించలేం. బాధ్యత, సమాజం కోసం పని చేయాలన్న తలంపు, ఓపిక, సహనం, ఉన్నప్పుడే రాజకీయాల్లో రాణిస్తాం. ఈ లక్షణాలన్నీ చిన్ననాటి నుంచే అలవర్చుకుని రాజకీయాల్లోకి వచ్చాను. మనది కులాలతో ముడిపడిన సమాజం. ఒకటి రెండు కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయాల్లో విజయం సాధించలేం. కులాల ప్రభావం అధికంగా ఉండే ఉత్తరప్రదేశ్‌లో కూడా కుల రాజకీయ ప్రయోగాలు విఫలమయ్యాయి. కులం పేరు చెప్పి వ్యక్తులు లాభపడుతున్నారు తప్ప కులాలు బాగుపడడం లేదు.
2009లో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటైన సందర్బంలోని అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జనసేనని తీర్చిదిద్దుతున్నాను. జనసేన పార్టీ ద్వారా ప్రజలకి సేవ చేయడానికి నిబద్దతతో పని చేస్తున్నాను. డబ్బు పెట్టి రాజకీయాల్లో లాభం పొందాలనుకునే వారు ఎక్కువగా ఉన్నారు. సేవ చేద్దామన్న తలంపు ఉన్నవారు కనుమరుగైపోతున్నారు. ఎదుటి వారిని తిట్టడం వల్లో బ్లాక్ మెయిల్ చేయడం వల్లో ముందుకి వెళ్లలేం. సేవ చేసినప్పుడే ఎవరైనా ముందుకు వెళ్తారు. ఒక పని చేయడానికి బలమైన అనుభవం కావాలి. పార్టీలో పైకి ఎదగాలంటే సామరస్య ధోరణి అవసరం. ఘర్షణపూరిత వైఖరితో కాకుండా ఒకరికి ఒకరు సహకారం అందించుకున్నప్పుడే విజయం సాధిస్తాం.
నేను ప్రవాహం లాంటి వాడిని… నన్ను ఎవరూ ఆపలేరు. పుట్టిన ప్రతి ఒక్కరు రెండు రకాలుగా మనుగడ సాధించవచ్చు. మొదటిది తనకి ఇష్టమైన రీతిలో తిని తిరిగి మరణించడం. రెండోది మనతోటి వారికి సాయపడుతూ సంఘానికి ఉపయోగపడుతూ సేవ చేస్తూ మరణించడం. నాకు రెండోది ఇష్టం. పార్టీ కోసం పని చేసేవారు సంతోషంతో చేయాలి. సేవాభావంతో పని చేయాలి. రాజకీయ ప్రయాణం చేసినప్పుడే రాజకీయ అనుభవం లభిస్తుంది. అప్పుడే మిమ్మల్ని ప్రజలు ఎన్నికల్లో ఆదరిస్తారు. వ్యక్తిగతంగా రాణిస్తూ కనీసం 10 వేల ఓట్లు సాధించుకునే సామర్ధ్యం ఉన్నవారిని పార్టీ తప్పకుండా అక్కున చేర్చుకుంటుంది. మన ముందు ఎన్నికలు ఉన్నాయి. చాలా తక్కువ సమయం ఉంది. తక్కువ కాలంలో అధిక ఫలాలు ఎలా సాధించవచ్చో సూచనలు ఇవ్వండి. వాటిని పార్టీ తప్పకుండా స్వీకరించి ఆచరిస్తుంద”న్నారు.
నెల్లూరు జిల్లా సమీక్షా సమావేశంలో…
ఉదయం నెల్లూరు జిల్లాకి చెందిన నాయకులు, కార్యకర్తలతో విడివిడిగా సమావేశం అయ్యారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లోకి కొత్తతరాన్ని తీసుకురాకుంటే ఆ జిల్లాకి అన్యాయం చేసిన వారిమవుతామని శ్రీ పవన్‌కళ్యాణ్ గారు అన్నారు. నెల్లూరు జిల్లా బలమైన రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా అనీ, నాటి మద్రాస్ ప్రెసిడెన్సీలో రాజకీయానికి పేరెన్నికగన్న జిల్లా అని తెలిపారు. రాజకీయ ఉద్దండులు పుట్టిన జిల్లా. రాజకీయం అంతా నేడు పది కుటుంబాల చేతుల్లో చిక్కుకుపోయిందన్నారు. జిల్లాలో రాజకీయ చైతన్యం తీసుకురావాలని ఎంతో మంది చెబుతున్న విషయాన్ని పార్టీ నేతల ముందు ఉంచారు. జనసేన పార్టీ పరంగా జిల్లా యువతని రాజకీయ యవనికపై నిలపాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నానని తెలిపారు. జిల్లాలో అపారమైన యువ బలగం జిల్లాలో జనసేన పార్టీకి ఉందన్నారు. రాజకీయంగా పండిపోయిన కుటుంబాలతో ఇక్కడి కొత్తతరం పోటీ పడవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఇది ఒకటి రెండు రోజుల్లో అవదన్న సంగతి తెలుసనీ, దీని కోసం దీర్ఘకాలికంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాజకీయ వారసత్వంతో మనుగడ సాగిస్తున్న కుటుంబాలని రాజకీయంగా ఎదుర్కోవడానికి యువత శక్తియుక్తులతో, ఓపికతో కష్టపడి పని చేస్తూ ప్రజలకి చేరువ కావాల్సి ఉందన్నారు. ఆ దిశగా జనసేన పార్టీ అడుగులు వేస్తోందని తెలిపారు. ఈ బాధ్యతను కూడా స్వయంగా తానే తీసుకుంటానని చెప్పారు. ఈ నెల 9 తర్వాత స్వల్పకాలికంగా పని చేసే జిల్లా స్థాయి కమిటీని ప్రకటిస్తానని తెలిపారు. ఈ కార్యాచరణకి సంబంధించి విజ్ఞులైన వారి నుంచి సలహాలు, సూచనలు ఆశిస్తున్నామన్నారు. ఈ ప్రక్రియలో కొత్త తరంపై మానసిక దాడులు జరిగే ప్రమాదం కూడా ఉందన్న శ్రీ పవన్‌కళ్యాణ్ గారు, ఆ దాడులని తట్టుకునే శక్తి జనసైనికులకి ఉందని భావిస్తున్నానన్నారు.