ఆంధ్రపదేశ్: బండ్లు ఓడలవుతాయి … ఓడలు బండ్లవుతాయి… ఈ సామెత ఇప్పుడు టీడీపీ పార్టీకి వర్తిస్తుందని చెప్పాలి. రాష్ట్ర రాజకీయాల్లో మూడు దశాబ్దాల కాలం పాటు తిరుగులేని ప్రాంతీయ పార్టీ ఒక వెలుగు వెలిగిన ఆ పార్టీకి చీకటి నీడలు చుట్టుముట్టుతున్నాయి. తెలంగాణలో ఇదివరకే దుకాణం ఎత్తేసిన టీడీపీ ఆంధ్ర ప్రదేశ్ లో కూడా తట్టా బుట్టా సర్దేసుకోవటాని సమయం దగ్గరపడింది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయాన్ని పంచాయితీ ఎన్నికలు ధ్రువీకరిస్తున్నాయి. రాష్ట్రంలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో తాము పుంజుకున్నామని టీడీపీ చెబుతున్నప్పటికీ, గ్రౌండ్ లెవల్‌లో ఆ పార్టీ తేలిపోయిన వైనం గురించి.. టీడీపీ అనుకూల మీడియానే స్పష్టం చేసేస్తోంది.
అదలా ఉండగా టీడీపీ… విధిలేని పరిస్థితుల్లో జనసేన పార్టీకి గ్రౌండ్ లెవల్‌లో మద్దతు ఇచ్చిందట. అయితే, ఈ మద్దతు నేరుగా జరగలేదనీ, స్థానికంగా టీడీపీ క్యాడర్, ‘ఇక టీడీపీతో దండగ’ అనే భావనకు వచ్చేసి, జనసేన వైపు మొగ్గుచూపుతున్నారనీ, ఉభయ గోదావరి జిల్లాల్లో ఇది చాలా ఎక్కువగా కనిపించిందనీ అంటున్నారు. టీడీపీ మద్దతుదారులైన కొందరు అభ్యర్థులు సైతం, జనసేన వైపుకు తమ ఓటు బ్యాంకుని మళ్ళించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం కూడా గుస్సా అవుతోందట. వాస్తవానికి, 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఓటు బ్యాంకుని కొల్లగొట్టేందుకు ఇటు టీడీపీ, అటు వైసీపీ నానా రకాల ప్రయత్నాలూ చేశాయి.
గుంటూరు జిల్లాకి చెందిన ఓ వైసీపీ నేత అయితే, ‘ఈ నియోజకవర్గంలో ఈసారికి నన్ను గెలిపించండి.. పవన్ మీద అభిమానం వుంటే.. అది ఇంకోసారి చూపించండి.. నా రాజకీయ జీవితానికి సమాధి కట్టొద్దు..’ అంటూ పవన్ అభిమానుల్ని, జనసైనికుల్ని వేడుకున్న విషయం అప్పట్లో రాజకీయంగా పెను దుమారం రేపింది.తూర్పుగోదావరి జిల్లాలో ఓ టీడీపీ నేత, ‘జనసేన మాకు మిత్రపక్షమే..’ అంటూ ప్రచారం చేసుకున్నారు. అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు కొన్ని చోట్ల పవన్ ఫొటోలతో ప్రచారం చేసుకున్న వైనం అప్పట్లో జనసైనికులకు పెద్ద షాకే ఇచ్చింది.
అలా, జనసేనను ఏ స్థానాల్లో అయితే వైసీపీ, టీడీపీ దెబ్బకొట్టాయో.. ఇప్పుడు అక్కడ, ఆ రెండు పార్టీలకు చెందిన క్యాడర్.. జనసేన వైపుకు మళ్ళినట్లు తెలుస్తోంది. లేకపోతే, పంచాయితీ ఎన్నికల్లో జనసేన ఉనికే వుండేది కాదు. జనసేన పేరు ప్రస్తావించడానికీ ఇష్టపడని స్థాయికి వైసీపీ, టీడీపీ అనుకూల మీడియా సంస్థలు వెళ్ళాయంటే , ఆ రెండు పార్టీలకూ ప్రత్యామ్నాయంగా జనసేన ఏ స్థాయికి ఎదిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైసీపీ అధికార పార్టీ గనుక, జనసేనతో ఇప్పటికిప్పుడు ఆ పార్టీకి వచ్చిన ముప్పేమీ లేదు. కానీ, టీడీపీ పరిస్థితి అది కాదు. జనసేన దెబ్బకు టీడీపీ గల్లంతయ్యే దుస్థితిలోకి వెళ్ళిపోయింది టీడీపీ.