“పులి గాండ్రించింది చల్ ఎత్తు పిడికిలీ”… జనసేన కొత్త పాట వైరల్!

ఎన్నికల ప్రచారంలో నేతల ప్రసంగాల పాత్ర ఒకరకంగా కీలకంగా మారుతుంటే… ప్రచార గీతాలు మరోరకంగా దుమ్ములేపుతూ, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి! ఈ క్రమంలో ఇటీవల కాలంలో వైసీపీకి సంబంధించిన “జెండలు జతకట్టడమే మీ ఎజెండో.. జనం గుండేల్లో గుడి కట్టడమే జగను ఎజెండో..” అంటూ నల్గొండ గద్దర్ పాడినపాట ఏ స్థాయిలో వైరల్ అయ్యిందనేది తెలిసిన విషయమే. ఈ క్రమంలో జనసేన నుంచి సరికొత్త ప్రచార గీతం విడుదలయ్యింది.

అవును… ఎన్నికల్లో నేతల ప్రసంగాలతో పాటు కేడర్ లో కొత్త ఉత్సాహం కలిగించేలా ప్రచార గీతాలు కీలక భూమిక పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే అధికార వైసీపీ, టీడీపీ గీతలు వైరల్ గా మారుతుండగా.. పూర్తిస్థాయి ప్రచార పర్వానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెరతీయ బోతున్నారని తెలుస్తున్న నేపథ్యంలో “జనసేన జంగ్ సైరన్” అంటూ ట్విట్టర్ వేదికగా ఒక కొత్త పాటను విడుదల చేశారు.

డ్యాన్స్ మాస్టర్ జానీ కొరియాగ్రఫ్ చేసి, నటించిన ఈ పాటను నల్గొండ గద్దర్ పాడారు. ఈ నెల 27నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టబోతున్నారని, దీనికోసం వారాహి వాహనాన్ని హైదరాబాద్ నుంచి మంగళగిరికి తరలిస్తున్నారని అంటున్న వేళ… ఈ పాట విడుదలైందని తెలుస్తుంది. సుమారు 5:30 నిమిషాల పాటు సాగుతున్న ఈ పాటలో వైసీపీ సర్కార్ పై విమర్శల వర్షం కురిపించారు.

ఇందులో భాగంగా… “పులి గాండ్రించింది చల్ ఎత్తు పిడికిలీ.. పగోడు పరారయ్యెలా పవనన్న అలికిడి.. రాష్ట్రాన్ని చేసినారురా నిలువెత్తు దోపిడీ.. ధమ్ముంటే కాసుకోడిరా జనసేన తాకిడీ..” అంటూ మొదలైంది ఈ పాట పల్లవి! ప్రస్తుతం ఈ పాట నెట్టింట వైరల్ గా మారింది. కామెంట్ సెక్షన్ లో అలజడి అప్పుడే మొదలైంది!