ఒకపక్క అధినేతలిద్దరూ చర్చించుకుంటున్నారు.. సీట్ల సర్ధుబాటుపై సీరియస్ గా డిస్కషన్స్ చేసుకుంటున్నారు.. మరోపక్క హరిరామ జోగయ్య లాంటి కాపునేతలు, సీనియర్ నేతలు… అధికారంలోకి వస్తే చెరిసగం రోజులు సీఎం కుర్చీని పంచుకోవాలని సూచిస్తున్నారు.. పవన్ ను తగ్గొద్దని చెబుతున్నారు. పవన్ కూడా కొన్ని విషయాల్లో బాబు దగ్గర కాస్త గట్టిగానే ఉన్నారని తెలుస్తుంది. ఈ సమయంలో జనసైనికులకు తుత్తర ఆగడం లేదు.
విషయం ఏదైనా.. సందర్భం మరేదైనా.. ఇద్దరు అధినేతలమధ్య అవగాహనా ఒప్పందాలకు సంబంధించి చర్చలు నడుస్తున్నప్పుడు… కింది స్థాయి కేడర్ అత్యుత్సాహం చూపిస్తే… తమ అధినేతే లోకువైపోతాడన్న కనీసం ఆలోచన జనసైనికులకు లేకుండాపోయింది. అందులో భాగంగా… జనసేన జెండాలు బయటకు తీసేశారు. అధినేత మాట ఫైనల్ తీసుకోకుండానే… టీడీపీ సభల్లో ఊరేగుతున్నారు.
పొత్తులు ఇంకా కుదరలేదు. సీట్ల పంపిణీ తేలలేదు. కేవలం ఇద్దరు పార్టీ అధినేతల మధ్య చర్చలు మాత్రమే జరిగాయి. ఇంకా పలుదఫాలు చర్చలు జరుగుతాయని చెబుతున్నారు. సీట్లు, అధికారంలోకి వస్తే పదవులపై చర్చ జరగాల్సి ఉంది. ఇంతలోనే… యువగళం పాదయాత్రలో ఇప్పటి వరకూ కన్పించని జనసేన జెండాలు కనిపించడం మొదలైపోయింది. అవును… ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర జరుగుతుంది. ఆ యాత్రలో జనసేన క్యాడర్ కూడా లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ పాల్గొన్నారు.
దీంతో… తలలుపట్టుకున్న జనసేన శ్రేయోభిలాషులు… ఎందుకొచ్చిన తుత్తరరా బాబూ అంటూ ఆవేదన చెందుతున్నారు. చర్చలు ఒక కొలిక్కి రానివ్వండి.. పవన్ చర్చల్లో కాస్త గట్టిగా పట్టుపట్టాలంటే.. మీరు అంతకంటే ఎక్కువ గట్టిగా ఉండాలి. అలాంటిది మీరే… తుత్తర పనులు చేస్తూ.. ఊపే హూహే వంటి పనులు చేయడం వల్ల… యువగళం యాత్రలో టీడీపీకి జరిగే మేలు కంటే… జనసేనకు జరిగే నష్టం ఎక్కువని గ్రహించాలని సూచిస్తున్నారు. మరి వీరి సూచనలు జనసైనికులు పరిగణలోకి తీసుకుంటారా..? లేదా అన్నది వేచి చూడాలి!
ఇక్కడ మరింత బలంగా వినిపిస్తున్న కామెంట్ ఏమిటంటే… సేనాని పవన్ కే ఆ జ్ఞానం లేనప్పుడు.. ముందు నుంచే మీ అవసరం మాకుందని బాబును దేబురించేస్తున్నప్పుడు.. జనసైనికులు మాత్రం ఏమి చేస్తారు? వారికి మాత్రం అంత జ్ఞానం ఎక్కడొస్తుంది అని వాపోతున్నారంట!
