పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ 3 లోక్ సభ స్థానాలను కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే కేవలం 24 మాత్రమే కేటాయించారంటూ కొంతమంది జనసైనికులు, జనసేన నేతలు, జనసేన సానుభూతిపరులు కూటమిపై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సంగతి అలా ఉంచితే… ఆ 24లోనూ 5 స్థానాలను మాత్రమే పవన్ ప్రకటించారు. అయితే… మిగిలిన స్థానాలపై కూడా ఫుల్ క్లారిటీ వచ్చిందని తెలుస్తుంది.
అవును.. జనసేనకు కేటాయించిన 24లోనూ మిగిలిన 19 నియోజకవర్గాలపైనా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా జిల్లాలవారీగా చూస్తే… ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 11 స్థానాల్లో జనసేన పోటీ చేయనుందని తెలుస్తుంది. ఇందులో… వెస్ట్ లో 6, ఈస్ట్ లో 4 స్థానాల్లో పోటీ చేయనుందని తెలుస్తుంది. ఇదే సమయంలో విశాఖ జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 2, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, కడప, చిత్తురు, అనంతపురం జిల్లాలో ఒక్కో సీటు జనసేనకు కేటాయించినట్లు తెలుస్తోంది.
ఇక నియోజకవర్గాల విషయానికొస్తే… శ్రీకాకుళంలో పాలకొండ, విజయనగరంలోని నెల్లిమర్ల, విశాఖ జిల్లాలోని విశాఖ దక్షిణం, అనకాపల్లి, ఎలమంచిలి, పెందుర్తి / మాడుగుల అని తెలుస్తుంది. వాస్తవానికి ఉమ్మడి విశాఖలో పెందుర్తి సీటుని జనసేన ఆశితోంది. అయితే ఈ సీటును టీడీపీకి వదిలి.. దాని స్థానంలో మాడుగులను తీసుకోవాలని చంద్రబాబు సూచించినట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లలో అత్యధికంగా 11 స్థానాల్లో పోటీ చేస్తుంది జనసేన. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు, రాజానగరం, పిఠాపురం, కాకినాడ రూరల్, అమలాపురం / పి.గన్నవారం స్థానాల్లో పోటీ చేస్తుంది. వాస్తవానికి జనసేన అమలాపురం టిక్కెట్ ఆశిస్తున్నప్పటికీ… పి.గన్నవరంలో మహాసేన రాజేష్ టీడీపీ నుంచి పోటీ చేయకుండా తప్పుకోవడంతో.. ఆ స్థానాన్ని తీసుకుని, అమలాపురం తమకు వదలాలని బాబు కోరినట్లు చెబుతున్నారు.
ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయానికొస్తే… నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, నిడదవోలు, పోలవరం నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయనుందని తెలుస్తోంది. ఇక కృష్ణాజిల్లాలోని విజయవాడ వెస్ట్, అవనిగడ్డ.. గుంటూరు జిల్లాలో తెనాలి.. ప్రకాశంలో దర్శి.. చిత్తురులో తిరుపతి.. కడపలో రైల్వే కోడూరు, అనంతపురంలో అనంతపురం నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక రెండు స్థానాల్లో క్లారిటీ రావాల్సి ఉంది!