ఈ చందాల గోలేంటి పవన్ కళ్యాణ్.?

అభిమానులంతా చందాలు వేసుకోండి.. ఒక్క రోజు వేతనాన్ని జనసేన పార్టీకి అందించండి.. అంటూ పెద్ద క్యాంపెయిన్ నడుపుతోంది జనసేన పార్టీ. రాజకీయ పార్టీ అన్నాక విరాళాలు సేకరించడం కొత్తేమీ కాదు. పార్టీ కార్యకర్తల నుంచి సభ్యత్వ నమోదు సమయంలో రుసుము కూడా తీసుకుంటాయ్.

జనసేన ఓ చిత్ర విచిత్రమైన భావజాలంతో రాజకీయం ప్రారంభించింది. జీరో బడ్జెట్ రాజకీయం అంటుంది.. ఇదిగో, ఇలా చందాల వసూలు వ్యవహారం నడుపుతుంటుంది. రోజుకు రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే పవన్ కళ్యాణ్, సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని రాజకీయాలకు వినియోగిస్తుంటానని చెబుతుంటారు.

అలాంటప్పుడు, ఈ విరాలాల సేకరణ ఎందుకు.? అంటే, పవన్ కళ్యాణ్ ఎంత ఖర్చు చేసినా, అది పార్టీకి సరిపోదు. నిజానికి, జనసేన పార్టీ నిధుల కొరతతో ఇబ్బంది పడుతోంది. పార్టీ ఫండ్ అంటే.. కేవలం పవన్ కళ్యాణ్ అందిస్తున్నదే.! ఇతర పార్టీల్లో అయితే కాంట్రాక్టర్లు, పారిశ్రామిక వేత్తలు ఇచ్చే విరాళాలు ఎక్కువగా వుంటాయ్.

జనసేనకి మాత్రం ఫండ్స్ కొరత వేధిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న దరిమిలా, నిధుల్ని సమకూర్చుకోవడానికి అభిమానులు, కార్యకర్తల మీద ఆధారపడాల్సి వస్తోంది పవన్ కళ్యాణ్‌కి. అభిమనులూ స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ప్రతియేడాదీ, ‘మేం సినిమాకి వెళ్ళామనుకుంటాం..’ అని చెబుతూ, వంద రూపాయల నుంచి తమకు తోచిన కాడికి పార్టీకి ఇస్తూనే వున్నారు.

ఈసారి కూడా ఇస్తారు.! చినుకూ చినుకూ కలిస్తే.. అదో ప్రవాహంలా మారిపోతుంది. జనసేనకు అందే విరాళాల వ్యవహారం కూడా అంతే. లక్షల సంఖ్యలో వున్న అభిమానులు, తమ రోజువారీ సంపాదనలో ఒక్కరోజు సంపాదనని జనసేన పార్టీకి ఇస్తే.. అది కోట్లలో వుండొచ్చు మొత్తంగా.

కానీ, ఈ వ్యవహారంపై వస్తోన్న విమర్శలకు జనసేన సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో వుంది.