పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం ఎన్నో మలుపులు తిరుగుతూ సాగుతోంది. 2024 ఎన్నికలలో జనసేన అనూహ్య విజయాన్ని సాధించి 100% స్ట్రైక్ రేట్‌తో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పవన్‌కు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పదవి దక్కడంతో ఆయన రాజకీయ భవిష్యత్తు మరింత బలపడింది. అటువంటి సందర్భంలో జనసేన 12వ ఆవిర్భావ సభ జరుగుతుండటంతో అందరి దృష్టి పవన్ ప్రసంగంపై పడింది. కానీ ఆయన మాట్లాడిన అంశాలు మిశ్రమ స్పందనను తీసుకొచ్చాయి. జనసేన 11 ఏళ్ల రాజకీయ పోరాటాన్ని స్మరించుకుంటూ, భవిష్యత్ లక్ష్యాలను ప్రకటిస్తారని ఆశించిన వారు నిరాశ చెందారు.
ఈ సభలో పవన్ ప్రధానంగా ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వ్యతిరేక కథనంపై ఫోకస్ చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల కాలంలో తన మంత్రిత్వ శాఖలు చేపట్టిన అభివృద్ధి, అమరావతి పునర్నిర్మాణం, రాష్ట్రానికి కేంద్రం నుంచి రాబట్టిన నిధుల వంటి కీలక అంశాలను ప్రస్తావించలేదు. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి ఏమి చేసింది? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన సభ ఇది. కానీ, గత పాలకుల తప్పుడు పాలనను ఎత్తిచూపే ప్రయత్నం చేయకుండా పవన్ తన వ్యక్తిగత ఇమేజ్‌పై వచ్చిన వ్యాసంపై మాత్రమే దృష్టిపెట్టడం ఆశ్చర్యం కలిగించిందనే కామెంట్స్ వస్తున్నాయి.
ఇక మరో ఆసక్తికరమైన విషయం బీజేపీ విధానాలపై పవన్ చూపించిన ఆసక్తి. హిందీ భాషకు మద్దతుగా ఆయన స్పష్టమైన వ్యాఖ్యలు చేయడం, పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాల మీద విమర్శలు చేయడం అనేక రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది. బీజేపీకి మిత్రపక్షంగా ఉండటంలో తప్పులేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నా, జనసేన సిద్ధాంతాలను పక్కనపెట్టి కేంద్ర ప్రభుత్వ నినాదాలను ముందుకు తీసుకెళ్లడం అవసరమా? అనే ప్రశ్నలెత్తుతోంది. ప్రత్యేకంగా ఏపీకి సంబంధించి కీలక విషయాల గురించి మాట్లాడకుండా, కేంద్ర ప్రభుత్వ విధానాలనే ప్రాధాన్యత ఇవ్వడం వలన పవన్ నిజమైన లక్ష్యం ఏమిటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సభ పవన్ రాజకీయ ప్రస్థానంలో మరో కీలక మలుపు కావాల్సిన సభ. కానీ, పార్టీ భవిష్యత్ దిశను స్పష్టంగా నిర్దేశించకుండా, అభివృద్ధి, సంక్షేమంపై సమగ్రంగా ప్రసంగించకుండా, అనవసరమైన అంశాలపై ఎక్కువ ఫోకస్ పెట్టలేదనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. దీన్ని ప్రత్యర్థి నాయకులు ఆయుధంగా తీసుకునే అవకాశం ఉంది. అయితే పవన్ ఈ తరహా విమర్శలు రావడం కొత్తేమి కాదు. ఒక్క సీటు నుంచి 100% స్ట్రైక్ రేటు వరకు వచ్చిన పవన్ ఎం చేసినా తనదైన శైలిలో ఆలోచించగలడని నిరూపించారు. మరి ఇప్పుడు ఈ తరహా కామెంట్స్ కు ఆయన భవిష్యత్తులో ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.