కిషన్ రెడ్డి జన్ ఆశర్వీద్ యాత్రతో ఏపీలో బీజేపీకి ఎంత లాభం.?

 

ఇదేదో కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి సొంత పబ్లిసిటీ వ్యవహారంలా వుంది తప్ప, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ఈ జన్ ఆశీర్వాద్ యాత్ర ద్వారా ఒనగూడే అదనపు ప్రయోజనం ఏమీ వుండకపోవచ్చు. అసలు ఏపీకి బీజేపీలో స్థానమెక్కడ.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోందాయె. పనిగట్టుకుని బీజేపీ నేతలు టీడీపీపైనో, వైసీపీపైనో విమర్శలు చేయడం తప్ప, వాళ్ళని రాష్ట్ర ప్రజలు ఏమైనా పట్టించుకుంటున్నారా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే. జనసేనతో మైత్రి లేకపోతే, అసలు బీజేపీ గురించి ఆలోచించే ఆ కొద్దిమంది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వుండకపోవచ్చన్నది మెజార్టీ అభిప్రాయం. ఎందుకిలా.? కారణాలు చాలానే వున్నాయి. పోలవరం ప్రాజెక్టుకి ఇవ్వాల్సిన నిధుల విషయంలో అయినా, ప్రత్యేక హోదా విషయంలో అయినా, కడప స్టీలు ప్లాంటు అలాగే దుగరాజపట్నం పోర్టు విషయంలో అయినా.. రాష్ట్రానికి సంబంధించిన కీలక వ్యవహారాల్లో బీజేపీ, ‘మాకేంటి సంబంధం.?’ అన్నట్టుగానే వ్యవహరిస్తోంది.

ఇదే బీజేపీకి పెద్ద మైనస్ పాయింట్. తెలంగాణలో అలా కాదు. ఆ పార్టీకి నాయకులున్నారు, ఏదో కాస్త హడావిడి నడుస్తోందక్కడ. తెలంగాణకైనా బీజేపీ ఏదన్నా చేస్తోందా.? అంటే, అది వేరే చర్చ. ఏపీకి మాత్రం బీజేపీ చేస్తున్నది గుండు సున్నా. ఏపీ నుంచి ఒక్కరికైనా కేంద్ర మంత్రి పదవి బీజేపీ ఇవ్వగలిగిందా.? లేదాయె. ఇంకెందుకు బీజేపీని ఏపీలో ఆదరించాలి.? అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. కిషన్ రెడ్డి యాత్రని ఏపీ ప్రజలు లైట్ తీసుకున్నారు. కేంద్ర మంత్రి కదా.. ప్రోటోకాల్ ప్రకారం కొంత హంగామా నడుస్తోందంతే. ఇక, బీజేపీ నేతల హడావిడి సరే సరి. బీజేపీకి ఏపీ మీద ఆశలేమన్నా వుంటే, విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అయినా వెనక్కి తీసుకోవాలి. ఆ దిశగా కేంద్రంపై కిషన్ రెడ్డి ఒత్తిడి తీసుకురాగలరా.? అంత సీన్ ఆయనకీ లేదు మరి.