టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా తనకు ప్రాణహాని ఉందన్నారు. ప్రభుత్వం కనీసం తనకి గన్ మెన్ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రోజూ తనను నాలుగు వాహనాల్లో కొందరు వెంబడిస్తున్నారని, తనకు ఏం జరిగినా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదే బాధ్యత అన్నారు. బీటెక్ రవి చేసిన వ్యాఖ్యలు కడప జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.
బీటెక్ రవి ఓ కేసులో అరెస్టై ఇటీవలే బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. మరోవైపు కడప జిల్లా పర్యటనలో ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను టీడీపీ నేతలు కలిశారు. పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల విషయంలో అడ్డంకులు ఎదురవుతున్నాయని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఇటు కడప జిల్లాలో ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ సమీక్షించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.హరికిరణ్, అడిషనల్ డీజీపీ ఎం. సంజయ్, ఎస్పీఅన్బురాజన్‌తో పాటూ అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణపై తీసుకున్న చర్యలు, ఎన్నికల ఏర్పాట్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల అధికారికి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.హరికిరణ్ వివరించారు.