సినిమాల్లో పవన్ ని అభిమానించేవారు పరోక్షంగానో ప్రత్యక్షంగానో జనసేనకు కూడా మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే థర్టీ ఇయర్స్ ఫృధ్వీ, జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది వంటి వారు నేరుగానే ప్రచారం మద్దతు తెలుపుతున్న పరిస్థితి. ఈ క్రమంలో తాను పవన్ కల్యాణ్ జనసేన మద్దతుదారుడినే కాదు.. ఎమ్మెల్యె టిక్కెట్ ఇస్తే పోటీ కూడా చేస్తానని చెబుతున్నాడు జబర్ధస్త్ మరో కమెడియన్ రంగస్థలం మహేష్.
వచ్చే ఎన్నికలలో నెల్లూరు నుంచి హైపర్ ఆది జనసేన ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడనే ప్రచారం నడుస్తోన్న క్రమంలో… తనకు కూడా టిక్కెట్ ఇస్తే జనసేన ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెబుతున్నాడు రంగస్థలం మహేష్. ఈ మేరకు తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాలపై స్పందించిన మహేష్… ఈ కామెంట్ చేశారు.
తనది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా శంఖరగుప్తం అని.. తన ఊరిలో పవన్ కళ్యాణ్ ని అందరూ అభిమానిస్తారని.. జనసేన పార్టీ కోసం అందరూ కష్టపడి పనిచేస్తున్నారని.. తనకి జనసేన తరుపున ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి పోటీ చేసే అవకాశం కల్పిస్తే.. కచ్చితంగా బలంగా నిలబడతాను అంటూ మహేష్ చెప్పుకొచ్చాడు. అనంతరం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన ఆయన… తన మొదటి ప్రాధాన్యత మాత్రం సినిమాలకే అని చెప్పారు.
తనది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అని చెబుతున్న మహేష్… ఇప్పుడు డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పరిధిలోకి వస్తారు. ఈ జిల్లాలో మూడు ఎమ్మెల్యే స్థానాలున్నాయి. అవి… అమలాపురం, పి.గన్నవరం, రాజోలు. మహేష్ ఊరు శంకరగుప్తం కాబట్టి.. అది రాజోలు నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. అది ఎస్సీ రిజర్వుడు స్థానం. 2019 ఎన్నికల్లో జనసేనకు గెలుపు రుచి చూపించిన స్థానం ఇది! అయితే ఆ స్థానాన్ని కాపాడుకోవడంలో పవన్ సక్సెస్ ఫుల్ గా ఫెయిలైన సంగతి తెలిసిందే!