మళ్లీ ఇరకాటంలో రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి మళ్లీ చిక్కుల్లో పడ్డారా… మొన్నటికి మొన్న ఓటుకు నోటు కేసులో జైలు పాలైన రేవంత్ రెడ్డి ఇంట్లో నిన్న ఐటి మరియు ఈడి అధికారులు గంటల తరబడి సోదాలు చేశారు. ఐటి సోదాల్లో ఏం దొరకలేదని రేవంత్ మీడియా ముందు చెప్పారు. కానీ రేవంత్ అక్రమాస్తులపై ఐటి వెలువరించిన నోట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భూ కబ్జాలు, భూ సెటిల్ మెంట్ ద్వారా ఐటి నోట్ లో వెల్లడయ్యింది. మరో సారి రేవంత్ ను ఐటి అధికారులు విచారించే అవకాశం ఉంది.  అసలు ఐటి నోట్ లో ఏముంది, ఏంటా వివరాలు తెలియాలంటే ఈ కింద స్టోరీ చదవండి.

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంటి పై గత నెల 27న జరిపిన ఐటి దాడులకు సంబంధించి అధికారులు నోట్ తయారు చేశారు. భూ దందాలు, సెటిల్ మెంట్ల ద్వారా రేవంత్ రెడ్డి, కుటుంబ సభ్యులు భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారని ఐటి అధికారులు నోట్ లో పేర్కోన్నారు. విదేశాల్లో అకౌంట్లు ఉన్నాయన్న ఆధారాలు అధికారులకు దొరకలేదు. సబ్ కాంట్రాక్టుల పేరుతో అక్రమాలకు పాల్పడినట్టు అధికారులు నోట్ లో స్పష్టంగా తెలిపారు.

బినామీ పేర్లతో రేవంత్ తన అనుచరులు, కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో డొల్ల కంపెనీలు పెట్టి అక్రమాలకు పాల్పడ్డాడని అధికారులు తేల్చారు. కెఎల్ ఎస్ ఆర్ ఇన్ ఫ్రాటెక్ కన్ స్ట్రక్షన్స్, భూపాల్ ఇన్ ఫ్రాటెక్, లక్ష్మీ ట్రాన్స్ కామ్ ప్రైవేట్ లిమిటెడ్, సాయి మౌర్య ఎస్టేట్స్, నెక్సస్ ఫీడ్స్ పేరుతో పాటు మరికొన్ని సంస్థలు రేవంత్ రెడ్డి తన బంధువుల ద్వారా నడిపిస్తున్నారని ఐటి అధికారులు నివేదికలో పేర్కొన్నారు.

విదేశాల్లో రేవంత్ రెడ్డికి అక్రమ లావాదేవిలు ఉన్నాయనే ఫిర్యాదుతో ఐటి అధికారులు రేవంత్ ఇంటి పై దాడులు నిర్వహించారు. అసలు రేవంత్ రెడ్డికి విదేశాల్లో అకౌంట్ లు లేవని అధికారులు స్పష్టం చేశారు. కెఎల్ ఎస్ ఆర్ అనే కన్ స్ట్రక్షన్ నుంచి సబ్ కాంట్రాక్టు రేవంత్ బంధువులు తీసుకున్నారు. అయితే ఇందులో 20కోట్ల రూపాయలు లెక్కలు చూపించలేదు. అదేవిధంగా మరో కంపెనీ వ్యవహారంలో 11 కోట్ల రూపాయలు, ఫార్చునర్ కారుకు సంబంధించి వివరాలను కూడా లెక్కల్లో పేర్కొనలేదు.  అది నెక్సస్ సంస్థ వారు గిఫ్టుగా ఇచ్చారని రేవంత్ తెలిపారు. రేవంత్ ఇంటిలో తనిఖీ చేసినప్పుడు 10 లక్షల రూపాయల నగదు, కిలో బంగారం దొరికినట్టుగా అధికారులు నివేదికలో పేర్కొన్నారు.

ఐటి దాడులు ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తనిఖీలలో అధికారులకు ఏం దొరకలేదని తన పత్రాలను చూసి అధికారులే విస్తుపోయారని రేవంత్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితిలో సోదాలు చేస్తున్నామని అధికారులు తనతో అన్నారని కూడా రేవంత్ తెలిపారు. తన ఇంట్లో ఏం దొరకలేదని తెలిపిన రేవంత్ ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఐటి అధికారలు తయారు చేసిన నోట్ మీడియాకు రిలీజైంది. మరిన్ని  వివరాలు తెలియాల్సి ఉంది. 

ఐటి నోట్

 

రేవంత్ రెడ్డి హీరోలా ఫీలయ్యి ఏదో చెప్పారని మరి ఇప్పుడు ఐటి అధికారులు నోట్ లో చెప్పిన వివరాలన్నీ కూడా రాజకీయ కుట్రతో చేసినవేనా అని బిజెపి నేతలు విమర్శించారు. రేవంత్ రెడ్డి అక్రమాల చిట్టా అందరికి తెలిసిందని ఇప్పుడు రేవంత్ బండారం పై కాంగ్రెస్ నేతలతో పాటు రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి చేసేవన్నీ దొంగ దందాలేనని అటువంటి ఆయనకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టిందని వారు ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డి పై కుట్ర పూరితంగా అధికారులు, ప్రభుత్వం ప్రవర్తిస్తున్నాయని ఎన్నికల వేళ ప్రతిపక్ష నాయకులపై ఇలాంటి కుట్రలు చేయడం సహజమేనని కాంగ్రెస్ నేతలు కొట్టి పారేశారు. నోటిసును అధికారులు ఇంకా బయటికి విడుదల చేయలేదు. ఆ నోటిసు రేవంత్ రెడ్డికి కూడా ఇంకా అందలేదని నోటిసు అందాక స్పందిస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు.