క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. నిజానికి వంగవీటి రంగా చనిపోయి దాదాపు 30 ఏళ్ళవుతోంది. అయినా బెజవాడ పాలిటిక్స్ లో ప్రధానంగా ఎన్నికల సమయంలోనే రంగా పేరు చుట్టూ రాజకీయాలు ఎందుకంతగా తిరుగుతున్నాయి ? ఎందుకంటే రాజధాని జిల్లాలైన గుంటూరు, కృష్ణాలో కాపుల ప్రాబల్యం బాగా ఉంటుంది. రంగా కేవలం కాపులకు మాత్రమే లీడర్ కాదు. రంగా బతికున్నంత కాలం అన్నీ వర్గాల వారికి బాగా సన్నిహితంగా ఉండేవారు.
ఎప్పుడైతే రంగా హత్య జరిగిందో తర్వాత జరిగిన విధ్వంసకాండ, రాజకీయ పరిణామాల్లో రంగాపై అందరూ కలిసి కాపునేత ముద్ర వేసేశారు. దాంతో రంగా కేవలం కాపులకు మాత్రమే పరిమితమైపోయారు. అందుకే ఇఫుడు రంగా అంటే కాపు నేత అనే ప్రచారం జరుగుతోంది. తాజా రాజకీయ పరిణామాల్లో కూడా రంగా టిడిపిలో చేరబోతున్నారనే ప్రచారం నేపధ్యంలో రంగా హత్యను ప్రముఖంగా తెరపైకి తెచ్చారు. రంగా హత్యకు చంద్రబాబునాయుడు, కోడెల శివప్రసాదరావే సూత్రదారులంటూ ఆరోపణలు ఎప్పటి నుండో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
తన తండ్రి హత్యకు టిడిపినే కారణమని గతంలో రంగా కొడుకు వంగవీటి రాధాకృష్ణ కూడా ఎన్నోసార్లు ఆరోపించారు. అవే ఆరోపణలను ప్రస్తుతం వైసిపి ఎత్తి చూపుతోంది. తండ్రిని చంపిన పార్టీలోకి, తండ్రి హత్యకు సూత్రదారులైన చంద్రబాబు, కోడెల దగ్గరకే రాధా ఎలా వెళతారంటూ వైసిపిలోని కాపు నేతల సామినేని ఉదయభాను, పేర్ని నాని నిలదీస్తున్నారు. అంటే రాధాకున్న కెపాసిటీని పక్కన పెడితే రంగాను హత్యచేసింది మాత్రం చంద్రబాబే అన్న విషయాన్ని వైసిపి నేతలు నొక్కి చెబుతున్నారు.
నిజానికి రంగా బతికున్నంత కాలం వైఎస్సార్ తో మంచి సంబంధాలుండేవి. ఇద్దరు ఒకటిగానే ఉండేవారు. ఆ సంబంధాల వల్లే జగన్, రాధా ఒకటయ్యారు. అయితే, ఎక్కడ చెడిందో కానీ ఇద్దరూ విడిపోయారు. అందుకనే ఒకవేళ రాధా టిడిపిలో చేరినా కాపు నేతలు, కాపుల్లోని న్యూట్రల్స్ మాత్రం టిడిపి వైపు చూడకుండా వైసిపి ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది. మరి వైసిపి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాల్సిందే.