చంద్రబాబునాయుడు గోలేంటో అర్ధం కావటం లేదు. వైద్య పరీక్షలకని అమెరికా వెళ్ళినవాళ్ళు ఆపనేదో చూసుకోకుండా రాష్ట్రంలో రాజకీయాల గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు ? మచిలీపట్నం పోర్టును తెలంగాణాకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందనే కొత్త గోల మొదలుపెట్టారు. ట్విట్టర్లో ఈ మేరకు ఆరోపణలు చేస్తూ ట్వీట్లు చేశారు లేండి.
బందరు పోర్టును తెలంగాణాకు అప్పగించేందు నిర్ణయం జరిగిపోయిందంటూ గోల మొదలుపెట్టారు. రెండు రోజుల క్రితం జీవో కూడా జారీ చేసి మళ్ళీ ఉపసంహరించుకున్నట్లు చెబుతున్నారు. బందరు పోర్టును తెలంగాణాకు అప్పగించేది లేదని అసెంబ్లీ చెప్పిన ప్రభుత్వం తెరవెనుక మాత్రం చకచక పావులు కదుపుతున్నట్లు ఆరోపిస్తున్నారట.
సీమాంధ్రులకు పోర్టులు ప్రకృతిచ్చిన వరమట. పోర్టులపై సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ ఎవరికీ లేదంటూ విచిత్రమైన లాజిక్ మొదలుపెట్టారు. అప్పటికేదో తాను సిఎంగా ఉన్నంత కాలం తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని జనాలకు చెప్పి లేకపోతే అఖిలపక్ష సమావేశం పెట్టి ఆమోదం తీసుకున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు.
ఒకవేళ బందరు పోర్టును తెలంగాణాకు ఇచ్చేయాలన్నా సాధ్యం కాదు కదా ? పోర్టును ఉపయోగించుకునేందుకు తెలంగాణాకు కూడా సౌకర్యాలు కల్పిస్తారంతే. అందుకు గాను తెలంగాణా ప్రభుత్వం నుండి ఫీజులు వసూలు చేస్తారు. ఫీజులు వసూలు చేయమంటే ఏపికి ఆదాయం వస్తున్నట్లే కదా ? నిజానికి బందరు పోర్టును తెలంగాణా కూడా వాడుకునేట్లు ప్రయత్నాలు మొదలైందే చంద్రబాబు హయాంలో. కాకపోతే కార్యరూపం దాల్చే సమయానికి ప్రభుత్వం మారిపోయింది. అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై చంద్రబాబుకు అంతలా మండిపోతోంది.