యంగ్ టైగర్ ఎన్టీయార్ ‘రాజకీయం’ చేస్తున్నాడా.?

Young Tiger NTR

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, డిన్నర్ మీటింగుకి ఆహ్వానిస్తే, సినీ నటుడు యంగ్ టైగర్ జూనియర్ నందమూరి తారకరామారావు వెళ్ళకుండా వుండగలడా.? అది అసలు పద్ధతి కూడా కాదు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అమిత్ షా కేవలం సినిమా వ్యవహారాలే జూనియర్ ఎన్టీయార్‌తో చర్చించారని ఎలా అనుకోగలం.? ఖచ్చితంగా ఈ సమావేశం వెనుక రాజకీయం వుండి తీరుతుంది.

రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ని బీజేపీనే, రాజ్యసభకు పంపింది. రాజమౌళికి బీజేపీ తగినంత గుర్తింపు, గౌరవాన్ని ఇస్తున్న మాట వాస్తవం. ఆ రాజమౌళి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన జూనియర్ ఎన్టీయార్‌ని కూడా తమవైపుకు లాగుతోంది బీజేపీ. ఎటూ టీడీపీతో మళ్ళీ పొత్తుకి బీజేపీ ప్రయత్నిస్తోంది గనుక, ఎన్టీయార్‌తో తమకు ముందు ముందు కొన్ని రాజకీయ ప్రయోజనాలు వుంటాయని బీజేపీ ఆ దిశగా ముందడుగు వేస్తే తప్పెలా అవుతుంది.?

కానీ, ఎన్టీయార్ కోణంలో చూస్తే.. ఇది ఆయన చాలా రిస్క్ చేస్తున్నట్లుగానే భావించాలి. కెరీర్ ఇబ్బందుల్లో పడే పరిస్థితి రావొచ్చు.. బీజేప వైపు ఎన్టీయార్ ఆలోచనలు సాగితే. బాలీవుడ్ సినిమా ‘బ్రహ్మాస్త్ర’ ప్రీ రిలీజ్ ఈవెంట్, హైద్రాబాద్‌లో జరగాల్సి వుండగా, దానికి తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. చివరికి ప్రెస్‌మీట్‌తో సరిపెట్టేశారు.

నిజానికి, ఈ కార్యక్రమం వల్ల ఎన్టీయార్‌కి వచ్చిన నష్టమేమీ లేదు. కాకపోతే, ఎన్టీయార్ అభిమానులు చాలా నష్టపోయారు. అది ఎన్టీయార్‌కి కూడా బాధ కలిగించింది. బల ప్రదర్శనకు ఎన్టీయార్ ఆ ఈవెంట్‌ని ఉపయోగించుకోవాలనుకున్నారనే ప్రచారాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం.

రాజకీయాలంటే ఇలాగే వుంటాయ్. ‘భారత పౌరులుగా మనం పోలీసుల సూచనలకు లోబడి వుండాలి.. వారు వున్నదీ మనకు రక్షణ కల్పించడానికే కదా..’ అంటూ ప్రెస్ మీట్‌లో ఎన్టీయార్ అభిమానులకు క్షమాపణ చెబుతూ, ఉద్బోధ చేశాడు. ఈ విషయంలో ఎన్టీయార్ చాలా హుందాగా వ్యవహరించాడు. అయితే, ప్రతిసారీ పరిస్థితులు ఇంత కూల్‌గా వుంటాయని అనుకోలేం. రాజకీయాలంటే, ఆ లెక్కే వేరు.