ఎందులో అయినా కాకపోయినా ఒక్క విషయంలో మాత్రం వైసిపి, జనసేనలు ప్రస్తుతానికి ఏకమయ్యాయి. ఎందులో అంటే ఓట్ల గల్లంతుకు సంబంధించి ఆందోళన తెలియజేయటంలో. తమ ఓట్లను ఏరేస్తున్నారంటూ వైసిపి ఆరోపణలు చేస్తుంటే తమ ఓట్లను కూడా ఏరేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడుతున్నారు. అవును జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతైపోయినట్లు ఒకవైపు వైసిపి నేతలు మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన చేస్తున్నారు. తమపార్టీకి పడే ఓట్లను గుర్తించి మరీ జాబితాలో నుండి పేర్లను ఏరేస్తున్నట్లు వైసిపి నేతలు మండిపోతున్నారు. వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పేదాని ప్రకారం తమ పార్టీ ఓట్లుగా గుర్తించిన సుమారు 36 లక్షల ఓట్లను ఏరేశారట. ఈమాటను వైసిపి నేతలు ఎప్పటి నుండో మొత్తుకుంటున్నారు. జిల్లాకు ఇన్ని లక్షల ఓట్లు అని టార్గెట్ పెట్టుకుని మరీ ఏరేస్తున్నట్లున్నారు చూడబోతే.
తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అదే మాదిరిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనసేనకు పడతాయని అనుకున్న ఓట్లు సుమారు 19 లక్షలు ఎత్తేశారంటూ కొంత కాలంగా గోలపెట్టేస్తున్నారు. ఓట్ల గల్లంతుపై ఈరోజు వైసిపి నేతలు ఎన్నికల కమీషనర్ ను కలిసి ఫిర్యాదులు కూడా చేశారు. ఆ సందర్భంగా పవన్ ఓ ట్వీట్ పెట్టారు. పిల్లల్ని ఎత్తుకెళ్ళేవాళ్ళను చూశాంగాని ఓట్లను ఎత్తుకెళ్ళే గ్యాంగులను ఇపుడే చూస్తున్నట్లు ట్వీట్టర్లో మండిపడ్డారు. మరి తెలుగుదేశంపార్టీ నాయకులు ఈ విషయమై ఏం మాట్లాడుతారో అని ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.
అయినా పవన్ అమాయకత్వం కానీ తామే ఓట్లను ఏరేశామంటూ అధికార పార్టీ నేతలు ఎక్కడైనా ఒప్పుకుంటారా ? అసలు ఓట్లను ఏరేయటానికి టిడిపి నేతలు అమలు చేస్తున్న విధానమేంటి ? అదే అర్ధకాక రాజకీయ పార్టీల నేతలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. అయితే, ఈమధ్యే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయిన ఐవైఆర్ కృష్ణారావు ఓ మాట చెప్పారు. అదేమిటంటే, ముఖ్యమంత్రి కార్యాలయం నుండి జనాలకు ఫోన్లు వస్తాయట.
చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులు గురించి వింటాం. ఓట్లు ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులు ని చూస్తున్నాం. మరి తెలుగుదేశం నాయకులు దీని గురించి ఏమి మాట్లాడతారని నేను ఎదురు చూస్తున్నాను. Party leaders have taken the decision to lodge a complaint with ‘Election Commission.’ pic.twitter.com/643bwDS3eD
— Pawan Kalyan (@PawanKalyan) November 1, 2018
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, లబ్దిదారుల సమస్యలు తదితరాలు మాట్లాడిన తర్వాత చివరగా చంద్రబాబునాయుడు పనితీరు మీద అభిప్రాయాలు అడుగుతూ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓట్లేస్తారని కూడా అడుగుతారట. చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగాను, టిడిపికి ఓట్లేయమని గనుక చెబితే ఇక అంతే సంగతులట. ఫోన్ వచ్చిన కొద్ది రోజులకు ఎందుకైనా మంచిది ఓటర్ల జాబితాలో పేరుందో లేదో చెక్ చేసుకోమని ఐవైఆర్ చెప్పారు. ఓట్ల ఏరివేతకు నిజంగా అదే విధానాన్ని అవలంభిస్తున్నట్లు కనబడుతోంది.