వైసిపిలోకి ఉండవల్లి ? చంద్రబాబుకు చుక్కలేనా

చంద్రబాబునాయుడుకు నిజంగా బ్యాడ్ న్యూసనే అనుకోవాలి. ఏపి రాజకీయాల్లో లాజిక్ మాస్టర్ గా పాపులరైన మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ త్వరలో వైసిపిలో చేరుతున్నట్లు సమాచారం. రాజమండ్రిలో రెండుసార్లు ఎంపిగా పనిచేసిన ఉండవల్లి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఆయన ప్రెస్ మీట్లో పాల్గొన్న మీడియా వాళ్ళకు ఆయన లాజిక్కులు వినటానికి ఎంత సరదాగా ఉంటాయో ప్రత్యర్ధుల గుండెల్లో అంతటి దడ పుట్టిస్తాయనటంలో సందేహం అక్కర్లేదు. ఉండవల్లి ప్రెస్ మీట్లో మాట్లాడే విషయం ఏదో గాలివాటుగా ఉండదు. ప్రతీ చిన్న విషయాన్ని పాయిట్ బై పాయిట్ మాట్లాడుతారు. ప్రతీ విషయాన్ని చక్కగా వివరించి చెబుతారు.

 

గడచిన నాలుగున్నరేళ్ళుగా చంద్రబాబు మీద టిడిపి నేతలపైన ఉండవల్లి చేస్తున్న మాటల దాడి అందరికీ తెలిసిందే. ఉండవల్లి చేస్తున్న ఆరోపణలపై చంద్రబాబు అండ్ కో నుండి ఒక్కదానికి కూడా కౌంటర్ లేదంటేనే ఆయన మాటల్లోని లాజిక్ అర్ధమైపోతోంది. పోలవరం పై చర్చకు ఆహ్వానిస్తే టిడిపి నుండి ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదు. ఒక విధంగా ఉండవల్లి అంటేనే చంద్రబాబు అండ్ కోకు ఒంట్లో వణుకనే చెప్పాలి. ప్రత్యర్ధుల్లో అంతటి వణుకుపుట్టిస్తున్న ఈ మాజీ ఎంపి త్వరలో వైసిపిలో చేరబోతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.

 

నిజానికి ఉండవల్లి చాలా కాలంగా యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.  ఆయన ప్రస్తుతానికి ఏ పార్టీతోను ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధాలు లేవనే చెప్పాలి. ఏ పార్టీలోను లేరన్న మాటే కానీ రోజూ చంద్రబాబు అండ్ కో పై మీడియా సమావేశాల్లో మండిపడుతునే ఉంటారు. ఉండవల్లి నైజం ప్రకారం టిడిపిలో చేరలేరు. అలాగని జనసేనలో కూడా ఇమడలేరు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే ఉద్దేశ్యం లేదని సమాచారం. ఇక మిగిలింది వైసిపి మాత్రమే.

 

ఈ నేపధ్యంలోనే ఉండవల్లి అవసరాన్ని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి కూడా ఈమధ్యనే ఉండవల్లి దగ్గరకు దూతలను పంపారట. ఎలాగూ సాధారణ ఎన్నికలు వస్తున్న నేపధ్యంలో వైసిపిలోకి వస్తే బాగుంటుందని అడిగారట. దానికి ఉండవల్లి కూడా ఆలోచించుకుని చెబుతానని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. అంటే తొందరలోనే ఉండవల్లి వైసిపిలోకి చేరే ముహూర్తం రెడీ అవుతోందని అనుకోవచ్చు.