చంద్రబాబునుద్దేశించి వెంకయ్య అంత మాటన్నారా ?

దశాబ్దాల పాటు కేంద్ర రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఉన్న వెంకయ్యనాయుడుకి చంద్రబాబానాయుడుకి మధ్య ఉన్న ఫెవికాల్ బంధం గురించి కొత్తగా ఎవరికీ చెప్పక్కర్లేదు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు బాధ్యతలు తీసుకునేంత వరకూ చంద్రబాబుపై ఈగవాలకుండా వెంకయ్య ఎలా చూసుకున్నారో అందరికీ తెలిసిందే.  అటువంటి వెంకయ్య తాజాగా చేసిన వ్యాఖ్యలు సూటిగా చంద్రబాబుకే తగులుతున్నాయి. అందుకే చంద్రబాబును ఉద్దేశించే వెంకయ్య సదరు వ్యాఖ్యలు చేశారా అనే చర్చ మొదలైంది.

 

ఇంతకీ వెంకయ్య ఏమన్నారంటే, ఆర్ధక నేరగాళ్ళు దేశం వదిలి వెళ్ళకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇక్కడ ఆర్ధిక నేరగాళ్ళంటే ఎవరు ? ప్రస్తుతం హాట్ టాపిక్ అయితే టిడిపి రాజ్యసభ సభ్యుడు, చంద్రబాబుకు బినామీగా ప్రచారంలో ఉన్న వ్యక్తి, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకుని బ్యాంకులను ముంచిన వ్యక్తి సుజనానే. అంటే విజయమాల్యా, నీరవ్ మోడి లాంటి వాళ్ళు కూడా బ్యాంకులను వేల కోట్లకు ముంచిన వారే కానీ వారు ఇపుడు దేశంలోనే లేరు. సుజనా ఒక్కడే ఇంకా దేశంలో ఉన్నాడు.

 

ఇక, పార్టీలు మారిన ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేయటంలో స్పీకర్లు ఫైల్ అవుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇది కూడా కెసియార్, చంద్రబాబును ఉద్దేశించే చేశారనటంలో సందేహం లేదు. పై ఇద్దరిలో కెసియార్ విషయం పక్కనపెట్టినా చంద్రబాబు మాత్రం వెంకయ్యకు బాగా సన్నిహితుడే. ప్రజలు ఎన్నుకున్న ఎంఎల్ఏలు అసెంబ్లీలకు వెళ్ళకపోవటం దారుణమని అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీకి వెళ్ళని ఎంఎల్ఏలంటే వైసిపి పార్టీనే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, వైసిపి ఎంఎల్ఏలు అసెంబ్లీకి వెళ్ళకపోవటానకి కారణం మళ్ళీ చంద్రబాబే అన్న విషయం వెంకయ్యకు తెలీదా ?

 

ఎన్నికల హామీలు విచిత్రంగా ఉంటున్నాయని, అమలు సాధ్యం కానీ హామీలనివ్వటం తప్పని వెంకయ్య చెప్పటమే విచిత్రంగా ఉంది. ఇప్పటి తెలంగాణా ఎన్నికల్లో అన్నీ పార్టీలు ఆచరణ సాధ్యం కానీ హామీలనే ఇచ్చాయి.  మిగిలిన పార్టీలను పక్కన పెడితే కేవలం 13 సీట్లకు మాత్రమే పోటీ చేస్తున్న టిడిపి కూడా లక్ష కోట్ల రూపాయలు విలువైన హామీలిచ్చిందంటే అర్ధమేంటి ? తెలంగాణా సంగతిని పక్కనపెట్టినా పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల మాటేమిటి ? ఇదే వెంకయ్య అప్పట్లో చంద్రబాబు పక్కనే ఉన్నారు కదా ? ఈ మాటలేవో అప్పుడే చెప్పుండచ్చు కదా ? మొత్తం మీద వెంకయ్య చేసిన వ్యాఖ్యలు, వేసిన చురకల్లో ఎక్కువ చంద్రబాబును ఉద్దేశించే ఉన్నట్లు అనిపించటం లేదు ?