ఇదీ ‘ఓటుకు నోటు’  బాపతేగా ?

నో డౌట్ ఇది కూడా ఒకరకంగా  ‘ఓటుకునోటు’ కేసు లాంటిదే. ఓటుకు నోటు అంటే ఏమిటి? ఓటుకోసం నోటివ్వడం.  ఇప్పటి వరకూ అందరికీ తెలిసిన ఓటుకునోటు కేసు వేరు, ఈ ఓటుకునోటు కేసు వేరు.  ఇప్పటి వరకూ అందరికీ తెలిసింది తెలంగాణాలో బయటపడిన కేసు. కానీ ఇపుడు చెప్పుకుంటున్నది మాత్రం రేపు అంటే బుధవారం మొదలవ్వబోయేది.  ఏంటి అర్ధం కాలేదా ? అదేనండి చంద్రబాబునాయుడు ఈరోజు లాంఛనంగా మొదలు పెట్టబోతున్న నిరుద్యోగ భృతి పథకం.  నిరుద్యోగ భృతి పథకం నిజానికి పోయిన ఎన్నికల్లో చంద్రబాబే ఇచ్చిన హామీ. హామీ మొదలవ్వాల్సింది 2014లో అధికారంలోకి రాగానే. అధికారంలోకి రాగానే మొదలవ్వాల్సిన పథకాన్ని  నాలుగున్నరేళ్ళ తర్వాత సరిగ్గా వచ్చే ఎన్నికల ముందు ప్రారంభిస్తున్నారంటే  అర్ధమేంటి ?

ఇస్తానన్న భృతిని ఇవ్వకపోవటంతో నిరుద్యోగులు చాలా జిల్లాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో ఆందోళనలు చేశారు. బిసి రిజర్వేషన్ల కోసం కాపులు ఎంతగా ఆందోళనలు చేశారో భృతి కోసం నిరుద్యోగులు కూడా అంతే ఆందోళనలు నిర్వహించారు. అయినా చంద్రబాబులో చలనం కనిపించలేదు. అటువంటిది ఇపుడు నిరుద్యోగ భృతి పథకం అంటూ చంద్రబాబు ఎందుకింత హడావుడి చేస్తున్నారు ? ఎందుకంటే, రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అన్న విషయం ఎవరికైనా అర్ధమైపోతుంది.

పథకాన్ని ఇపుడు ప్రారంబిస్తాం, అపుడు ప్రారంభిస్తామంటూ దాదాపు ఏడాది కాలం నెట్టుకొచ్చారు. భృతి ఎంతమందికివ్వాలి ? ఎప్పుడు ప్రారంభించాలనే విషయాలు తేల్చటానికంటూ ఓ కమిటీ కూడా వేశారు. అదంతా కేవలం కాలయాపనకే అన్నది అందరికీ తెలుసు. మామూలుగా అయితే ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఇంకాస్త సమయం పడుతుందని అనుకున్నారు. అయితే, జాతీయ స్ధాయిలో జమిలి ఎన్నికలని, తెలంగాణాలో లాగే ఏపిలో కూడా ముందస్తు ఎన్నికలనే ప్రచారం ఊపందుకోవటంతో పథకాన్ని ప్రారంభించేశారు.  

ఈ పథకాన్ని ప్రారంభించటంలో ఇంకా జాప్యం జరిగితే రేపటి ఎన్నికల్లో టిడిపి పుట్టి ముణుగుతుందని చంద్రబాబులో ఆందోళన మొదలైంది. ఒకవైపు ఖజానాలో డబ్బులేదు. మరోవైపు ఎన్నికలు షెడ్యూల్ కన్నా ముందే జరుగుతందనే ప్రచారం. ఇంకోవైపు భృతి కోసం  రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల ఆందోళన. దాంతో చంద్రబాబు పథకాన్ని ప్రారంభించేశారు. అయితే, ఇక్కడే ఓ తిరకాసు కూడా పెట్టారు లేండి చంద్రబాబు.

అదేమిటంటే భృతికి అర్హులైన నిరుద్యోగులు 10 లక్షల మంది ఉన్నట్లు స్వయంగా ప్రభుత్వమే లెక్క తేల్చింది. పోయిన ఎన్నికల్లో ఇస్తానన్నది నెలకు రూ. 2 వేలు. కానీ అనేక లెక్కల తర్వాత  ఇపుడు ఇస్తున్నది వెయ్యి రూపాయలు మాత్రమే. అంటే రుణమాఫీ లెక్కల్లాగే నిరుద్యోగ భృతిని కూడా బాగా తెగ్గోసేశారు. సరే, ఎంతోకొంత ఇస్తున్నారులే అనుకుంటే ఇందులో కూడా మళ్ళీ కోతేశారు. దరఖాస్తులు చేసుకున్నది 6 లక్షలమందేనట. అందులో కూడా పథకం వర్తిస్తున్నది కేవలం 2 లక్షల మందికేనట. సరే ప్రభుత్వం లెక్కల ప్రకారమే నెలకు 2 లక్షల మందికి తలా వెయ్యి రూపాయలంటే ఎంతవుతుంది ?  నెలకు రూ. 200 కోట్లు. ఎనిమిది నెలల పాటు అంటే షెడ్యూల్ ఎన్నికలు జరిగే వరకూ ఈ పథకం అమలకు మొత్తం ఖర్చు రూ. 1600 కోట్లు.

అంటే, రేపటి ఎన్నికల్లో ఓట్ల కోసమే ఈ పథకాన్ని చంద్రబాబు ఇపుడు ప్రారంభించారన్నది స్పష్టం. అదే విషయాన్ని భృతి అందుకోబోతున్న ఓ నిరుద్యోగికి అనుమానం కూడా వచ్చింది. ఆ విషయమై చంద్రబాబు మాట్లాడుతూ ఈ పథకాన్ని తాను ఓట్ల కోసం ప్రారంభించలేదంటూ భుజాలు తడుముకున్నారు. పైగా మీకు మంచిచేసే వాళ్లకే అందరూ మద్దతివ్వాలంటూ నిరుద్యోగులకు ఉపదేశం కూడా చేశారు.  తెలంగాణాలో బయటపడిన ఓటుకునోటు కేసులో తెరవెనుక ఉండి నడిపించినపుడు చేతులుమారిన డబ్బు ఎవరిదో. కానీ ఇపుడు తెరముందు నుండే నడిపిస్తున్న ఈ కేసులో డబ్బంతా ప్రభుత్వానిదే. అంటే ప్రభుత్వం సొమ్ముతో టిడిపికి లబ్ది చేకూర్చే ఫక్తు ఓటుకునోటు కేసే అనటంలో సందేహమేలేదు. నిజంగానే ఇదొక సంక్షేమ పథకమే అయితే పోయిన ఎన్నికల్లో అధికారంలోకి రాగానే ఎందుకు ప్రారంభించలేదు ? ఎవరికైనా ఎనీ డౌట్ ?