షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ తెలుగుదేశంపార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధుల్లో అసహనం కట్టలు తెంచుకుంటోంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న సామెతలాగ అయిపోయింది టిడిపి నేతల వ్యవహారం. ఓటర్లను చంద్రబాబు బెదిరిస్తుండటంతో మంత్రులు, ఎంఎల్ఏలు కూడా బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఎంఎల్ఏ, విప్ కూన రవికుమార్ బెదిరింపుల వ్యవహారం సంచలనంగా మారింది.
నియోజకవర్గంలోని శివ అనే కార్యకర్త ఎవరో టిడిపి నుండి దూరంగా జరిగారు. దానికే రవి రెచ్చిపోయి ఫోన్లో బెదిరింపులకు దిగారు. టిడిపి జెండా పట్టుకుని తనకు పని చేయకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించటమే ఆశ్చర్యంగా ఉంది. తనలో ఒక యాంగిలే చూశారని తాను చెప్పినట్లుగా వినకపోతే రెండో యాంగిల్ కూడా చూడాల్సొస్తుందంటూ బెదిరించటం విచిత్రంగా ఉంది.
ఇటువంటి బెదిరింపులను మొదలుపెట్టింది చంద్రబాబు. తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు అందుకున్నాడు. మధ్యలో చింతకాయల అయ్యన్నపాత్రుడుది కూడా ఇదే వరస. తాజాగా కూన రవికుమార్. భవిష్యత్తులో ఇంకెంతమంది ఇలా మాట్లాడుతారో తెలీదు. సరే ఈ విషయాలన్నింటినీ పక్కన పెడదాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్ది మంత్రులు, టిడిపి నేతలు ఎందుకింతగా రెచ్చిపోతున్నారో అర్ధం కావటం లేదు.
రాబోయే ఎన్నికల్లో గెలిచేది తామే అని అనుకుంటున్నపుడు ఓటర్లను, కార్యకర్తలను బెదిరించాల్సిన అవసరం ఏంటి ? నిజంగా గెలుపు మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఇలా బెదిరింపులకు దిగరన్నది అందరికీ తెలిసిందే. ఓటర్లను బెదిరిస్తేనో లేకపోతే ప్రమాణాలు చేయిస్తేనో టిడిపికే ఓట్లేస్తారని, కార్యకర్తలను బెదిరించి పనులు చేయించుకోవచ్చని అనుకుంటే అంతకన్నా పిచ్చితనం ఇంకోటుందన్నది గ్రహించాలి. కాకపోతే మంత్రులు, ఎంఎల్ఏల బెదిరింపుల వల్ల వారిలో ఓటమిభయం పెరిగిపోతోందని అర్ధమైపోతోంది.